చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. 

14 Apr, 2021 13:24 IST|Sakshi
న్యాయం చేయాలంటూ చంద్రబాబును నిలదీస్తున్న వెంకట్‌. (ఇన్‌సెట్‌)లో మీడియాతో మాట్లాడుతున్న వెంకట్‌

టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వరరావు

పార్టీ ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్‌ 

తిరుపతిలో రాళ్ల దాడి అవాస్తవం

చొక్కా విసిరితే రాళ్ల దాడి అంటూ చిత్రీకరణ

నమ్ముకున్న వారిని వెన్నుపోటు పొడవడమే బాబు లక్ష్యం 

తిరుపతి క్రైం: ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. మంగళవారం రాత్రి ఆయన తిరుపతి వెస్టు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేశానన్నారు. అయితే చంద్రబాబు, అచ్చెన్నాయుడు గుర్తించక పోవడమే కాకుండా చిన్నపాటి సహాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈయన ఇంకా ఏమన్నారంటే.. 
చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు అత్యంత సన్నిహితుడైన కేఎల్‌ నారాయణ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్‌లోని  నా 400 గజాల భూమిని కబ్జా చేశాడు. దీనిపై చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నాను. 
చంద్రబాబు ఒక మాట చెబితే నా భూమి నాకు నిమిషాల్లో వస్తుంది. అయితే ఆయన ఆ మాట చెప్పకుండా కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యారు. ఈ విషయంపై మరో మారు విన్నవిద్దామని సోమవారం తిరుపతిలో జరిగిన ప్రచార సభకు హాజరయ్యాను. 
పలు మార్లు చంద్రబాబునాయుడును పిలిచినా కూడా చూసీ చూడనట్టు వ్యవహరించడంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ క్రమంలో నిరసన తెలియజేసేందుకు చొక్కా విప్పి విసిరేశాను. అయినా కూడా పట్టించుకోక పోవడంతో ముందుకెళ్లి నిలదీశాను. తనకు ఏమీ పట్టనట్టుగా అభివాదం చేస్తూ తప్పించుకుని పారిపోయాడు.  
చంద్రబాబు వెనుక ఉన్న రామ్మోహన్‌నాయుడు ‘అన్నా నేను నీతో మాట్లాడుతా’ అని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు. చొక్కా విసరడం అందరూ చూడడంతో ఆ సంఘటనను పెడదారి పట్టించేందుకే చంద్రబాబుపై రాళ్లు పడ్డాయంటూ కొద్దిసేపటికే కొత్త డ్రామా ప్రారంభించారు. 
బాబుపై ఎలాంటి రాళ్లూ పడలేదు. బాబు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం సహజమే. నేను 30 సంవత్సరాలుగా టీడీపీలోనే ఉంటూ ఒకసారి జూబ్లీ హిల్స్‌లో కార్పొరేటర్‌గా కూడా పోటీ చేశాను. ఈ పరిస్థితిలో చంద్రబాబు వల్ల నాకు ప్రాణ హాని ఉంది. మరోవైపు టీడీపీ ముఖ్య నాయకులు చంపేస్తామని ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నారా లోకేష్‌ను ఏదైనా సాయం చేయమని కోరితే ఇంటిల్లిపాది కట్టకట్టుకుని చావమంటూ సలహా ఇచ్చారు. వీరిని నమ్మి ఎవరూ మోసపోవద్దు.

చదవండి:
17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు  
ఓటమి భయంతోనే రాళ్ల దాడి డ్రామా

మరిన్ని వార్తలు