-

పగబట్టిన పొగమంచు..

13 Mar, 2021 07:48 IST|Sakshi
ప్రమాదానికి గురైన కారు..

కమ్మేసిన పొగమంచులో కానరాని దారి

అర్ధరాత్రి కాలువలోకి దూసుకుపోయిన కారు

ముగ్గురి దుర్మరణం.. ఇద్దరు సురక్షితం

లొల్ల లాకుల వద్ద దుర్ఘటన

సంఘటనపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దిగ్భ్రాంతి

ఆత్రేయపురం: అర్ధరాత్రి పొగమంచు.. మార్గంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడమే లొల్ల లాకుల సమీపాన జరిగిన కారు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద.. బొబ్బర్లంక – రావులపాలెం రోడ్డుపై ముక్తేశ్వరం ప్రధాన కాలువలోకి కారు దూసుకు పోయిన సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఇదే మండలం తాడిపూడికి చెందిన ఇందుకూరి సత్యనారాయణరాజు (43) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో పని చేస్తున్నారు. మిత్రులతో అక్కడే ఉంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా స్నేహితులతో కలిసి గురువారం కారులో స్వగ్రామం వచ్చారు. వసంతవాడలో పార్వతీ పరమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరందరూ రాత్రి తిరిగి భీమవరం బయలుదేరారు. కారును చింతలపాటి శ్రీనివాసరాజు (46) నడుపుతున్నారు.

ఆయన పక్కన ముందు సీటులో ఇందుకూరి సత్యనారాయణరాజు కూర్చున్నారు. వెనుక సీటులో ముదునూరి గణపతిరాజు, గొట్టుముక్కల బాపిరాజు చెరోపక్కన కూర్చోగా, వారి మధ్యలో ముదిండి సురేష్‌వర్మ కూర్చున్నారు. ఊరు దాటగానే పొగమంచు ఎక్కువగా ఉంది. దీంతో మార్గం కనిపించలేదు. అర్ధరాత్రి సమయానికి లొల్ల లాకుల వద్దకు చేరేసరికి కారు అదుపు తప్పి ముక్తేశ్వరం ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇందుకూరి సత్యనారాయణరాజు, చింతలపాటి శ్రీనివాసరాజు (46), ముదిండి సురే‹Ùవర్మ (38) మరణించారు. కారు వెనుక సీటులో కూర్చున్న ముదునూరి గణపతిరాజు, గొట్టుముక్కల బాపిరాజులు ప్రమాదాన్ని గమనించి డోర్లు తెరచుకుని చెరోపక్కకు దూకేసి, సురక్షితంగా బయట పడ్డారు. మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీసినట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

ఇదీ మృతుల నేపథ్యం 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చింతలపాటి శ్రీనివాసరాజుది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కేశవరం. ఆయన రొయ్యల వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య శిరీష, కుమారుడు అవినాష్‌వర్మ ఉన్నారు. వర్మ ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. 
మరో మృతుడు ముదిండి సురేష్‌వర్మది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఈడూరు. ఆయన లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య ప్రమీల, కుమార్తె వర్షిత ఉన్నారు. కుమార్తె భీమవరంలో ఇంటర్‌ చదువుతోంది. 
మరో మృతుడు ఆత్రేయపురం మండలం తాడిపూడికి చెందిన ఇందుకూరి సత్యనారాయణరాజుకు భార్య మాధవి, ఏకైక కుమారుడు అఖిల్‌వర్మ ఉన్నారు. వర్మ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

హెచ్చరిక బోర్డులేవీ! 
బొబ్బర్లంక–రావులపాలెం ఆర్‌అండ్‌బీ రోడ్డుపై లొల్ల లాకుల వద్ద మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి వాహన చోదకులు ఈ మలుపును గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా కాలువలోకి దూసుకుపోతున్నారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే కొట్టుకుపోతున్నారు. ఇటీవల ఏడెనిమిది సంఘటనలు జరిగాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారే కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా కొత్తవారు ఈ మార్గంలో ప్రయాణిస్తే కాలువలోకి దూసుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

రూ.59 కోట్లతో ప్రతిపాదనలు
శిథిలావస్థకు చేరిన లొల్ల లాకుల మరమ్మతులకు రూ.59 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లామన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కొంత అభివృద్ధి జరిగిందన్నారు. ఈ నెలాఖరున క్రాప్‌ హాలిడే ప్రకటించగానే ఇక్కడ వంతెన నిర్మాణం, ఇతర పనులు చేపడతామన్నారు. గడ్డర్లు ఊడిపోయే స్థితిలో ఉన్నాయన్నారు. కారు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రిల్‌ ఊడిపోవడం వల్లే కారు కాలువలోకి దూసుకుపోయిందని అభిప్రాయపడ్డారు. మృతదేహాలకు నివాళులర్పించారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ మండల కనీ్వనర్‌ కనుమూరి శ్రీనివాసరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ముదునూరి రామరాజు, మాజీ ఎంపీపీ పీఎస్‌ రాజు, వాడపల్లి ఆలయ కమిటీ సభ్యులు పెన్మెత్స సురేష్‌రాజు తదితరులు ఉన్నారు.
చదవండి:
తల్లీబిడ్డ మృతి కేసు.. విస్తుపోయే నిజాలు  
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ, జనసేన వర్గీయుల దాడి  

 

మరిన్ని వార్తలు