Road Accident : ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం...

9 Jun, 2023 12:01 IST|Sakshi

 (కాకినాడ జిల్లా): కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ముగ్గు రు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తొండంగి ఎస్సై రవికుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురానికి చెందిన పోలవరపు కిరణ్‌ (23), పసుపులేటి దుర్గా శివప్రసాద్‌ (20), కాకర వీరబాబు(21) స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి బుధవారం రాత్రి బైకుపై స్వగ్రామం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా అన్నవరంలో జరిగే స్నేహితుని వివాహానికి బయలుదేరారు.

వేమవరం, యర్రయ్యపేట మీదుగా ముగ్గురూ వస్తుండగా జి.ముసలయ్యపేట వద్ద వీరి బైకు ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో పోలవరపు కిరణ్, కాకర వీరబాబులు సంఘటన స్ధలంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గా శివప్రసాద్‌కు తీవ్రగాయాలై ప్రాణాపా య స్ధితిలో ఉండగా స్ధానికులు తుని ఏరియా ఆస్పత్రికి  తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి  తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.  

కన్నవారికి కడుపు కోత 
ఒకరికి తల్లిదండ్రుల్లేరు. మరొకరికి తండ్రి లేడు. ఇంకొకరికి తండ్రి ఉన్నా.. అతని అండ లేదు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడై ఉండేవారు. కష్టపడి పనిచేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా ఉన్నారు. వయసులో వారి మధ్య ఏడాది, రెండేళ్ల వ్యత్యాసమే. ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం. అలాంటి మిత్రులను మృత్యువు కూడా ఒకేసారి కాటేసింది. దీంతో ఒకే రోజు మూడు కుటుంబాల్లో విషాదం నెలకొని, గ్రామం మూగబోయింది.  దుర్గాశివప్రసాద్‌కు తల్లిదండ్రుల్లేరు. చిన్నప్పటి నుంచి మేనత్త రమణమ్మ వద్దే ఉంటున్నాడు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే మిల్లర్‌ పని చేస్తూ, ఆమెకు భరోసాగా ఉన్నాడు. ఇతని మరణంతో మేనత్త రమణమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.  

 కిరణ్‌కుమార్‌కు తల్లి లక్ష్మి, సోదరి హరిణి ఉన్నారు. తండ్రి బతికే ఉన్నా.. ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. తల్లి స్థానికంగా ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలిపని చేస్తుంది. సోదరి దివ్యాంగురాలు కావడంతో ఆశలన్నీ కిరణ్‌మీదే పెట్టుకున్నారు. కిరణ్‌ గ్రామంలో కూలి పనులతోపాటు, పెయింటింగ్‌ పనులకు వెళ్తుంటాడు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూస్తున్నారు. అలాంటి సమయంలోనే తమకు అందరాని దూరాలకు పోయిన కిరణ్‌ను తలచుకుంటూ ఆ తల్లి, కూతుళ్ల శోకం ఊరంతటినీ పట్టి కుదిపేస్తోంది.  

 కాకర వీరబాబు మిల్లర్‌ పనితోపాటు, వ్యాన్‌ డ్రైవింగ్‌ చేస్తుంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. తండ్రి దారబాబు ఇంటి వద్దనే ఉంటాడు. తల్లి మేరీ గల్ఫ్‌లో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. కొడుకు మరణవార్త తెలుసుకుని ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరినట్టు తెలిసింది.    

మరిన్ని వార్తలు