ఏపీకి 21, తెలంగాణకు 92 టీఎంసీలు

11 Mar, 2022 03:44 IST|Sakshi

కృష్ణా జలాలను పంపిణీ చేసిన బోర్డు త్రిసభ్య కమిటీ

మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించకూడదన్న ఏపీ

లెక్కించాలన్న తెలంగాణ డిమాండ్‌కు బోర్డు కార్యదర్శి రాయ్‌పురే ఓకే

మే 31లోగా కోటా నీటిని వాడుకోవాల్సిందేనని పునరుద్ఘాటించిన ఏపీ

సీడబ్ల్యూసీ అనుమతి లేని ప్రాజెక్టులను ఆపేయాలన్న బోర్డు కార్యదర్శి

హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగకు ఆమోదం ఉందన్న ఏపీ

వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన కోటా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 21, తెలంగాణకు 92 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం నీటి మట్టం అడుగంటినందున, నాగార్జున సాగర్‌ నుంచి రివర్స్‌ పంపింగ్‌ చేసిన జలాలను తాగు నీటి అవసరాలకు వాడుకోవాలని తెలంగాణకు సూచించింది. రబీలో సాగు నీరు, వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగు నీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

ఏపీ ఈఎన్‌సీ ప్రతినిధిగా కర్నూలు ప్రాజెక్టŠస్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌లు పాల్గొన్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణాలో ఉన్న 953 టీఎంసీల్లో 629 టీఎంసీలు (66 శాతం) ఏపీకి, 324 టీఎంసీలు (34 శాతం) తెలంగాణకు దక్కుతాయని రాయ్‌పురే తేల్చారు. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించకూడదంటూ ఏపీ సీఈ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం తెలిపారు. మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించాల్సిందేనని ఆయన చేసిన డిమాండ్‌కు రాయ్‌పురే అంగీకరించారు. మళ్లించిన వరద జలాలతో కలుపుకొని ఏపీ ఇప్పటిదాకా 608, తెలంగాణ 232 టీఎంసీలు వాడుకున్నట్లు బోర్డు తేల్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 113 టీఎంసీల్లో ఏపీకి 21, తెలంగాణకు 92 టీఎంసీలను కేటాయించింది. 

అనుమతి లేని ప్రాజెక్టులు ఆపేయాలా? 
కృష్ణా బోర్డు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయి ఆర్నెల్లు పూర్తయినందున,  కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతి తెచ్చుకోని ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని వచ్చే నీటి సంవత్సరం నుంచి ఆపేయాలని రాయ్‌పురే కోరారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూల్‌ ద్వారా ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ,  తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు (సామర్థ్యం పెంచనివి) ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించిందని, వాటికి మళ్లీ అనుమతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా గెజిట్‌ నోటిఫికేషన్‌ను అబయన్స్‌లో పెట్టాలని కేంద్ర జల్‌ శక్తి శాఖను కోరినట్లు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ చెప్పారు. దీంతో ఈ అంశంపై బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చిద్దామని రాయ్‌పురే చెప్పారు.

మిగిలిన పది టీఎంసీలు ఏపీకి ఇవ్వండి 
నీటి సంవత్సరం ముగిసే మే 31 లోగా కోటా నీటిని వాడుకోవాలని, లేదంటే మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. సాగు, తాగు నీటి అవసరాలకు 82 టీఎంసీలకు తెలంగాణ ప్రతిపాదన పంపినందున, ఆ రాష్ట్ర కోటాలో మిగిలిన 10 టీఎంసీలను తమకు కేటాయించాలని ఏపీ సీఈ కోరారు. దీనిపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఈఎన్‌సీ చెప్పారు. 

మరిన్ని వార్తలు