AP: మరో మూడు రోజులు వర్షాలే

23 Jul, 2022 08:43 IST|Sakshi

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: నైరుతి రుతు పవనాలు బలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా కర్నాటకపై ఉపరితల ద్రోణి ఆవరించింది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 

విజయవాడలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో సగటున అత్యధికంగా 3.1 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1.5 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలో 1.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మండపేటలో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అమరావతిలో 8.7 సెంటీమీటర్లు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 7.9, పల్నాడు జిల్లా మద్దాలిలో 7.1, గుంటూరు జిల్లా మంగళగిరిలో 6.9, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 6.7, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 6.6, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ శివారు నున్నలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెదకూరపాడు మండలం బలుసుపాడు, పరస గ్రామాల మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

తూర్పు గోదావరి జిల్లాలో సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో ధవళేశ్వరం, కొవ్వూరులో వీధులన్నీ జలమయమయ్యాయి. రాజమహేంద్రవరంలోని ప్రధాన రహదారిపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు ఎదుర్కొన్నారు. హుక్కుంపేట, సావిత్రినగర్, శ్రీనివాసనగర్‌లలో వర్షం నీరు చేరింది. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంతటా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. సరాసరి వర్షపాతం 24.4 మి.మీ.గా నమోదైంది. విడవలూరు మండలంలో 71.6 మిల్లీమీటర్లు, మనుబోలు మండలంలో 5.6 మి.మీ. వర్షం పడింది.

మరిన్ని వార్తలు