వదలని వానలు.. మరో మూడురోజులు వర్షాలు

24 Mar, 2023 04:55 IST|Sakshi

కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వానలు

కొనసాగుతున్న ద్రోణి ప్రభావం

అనకాపల్లి జిల్లాలో 9.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాదాపు వారం రోజుల నుంచి వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీగాను వర్షాలు పడుతున్నాయి.

అంతర్గత తమిళనాడు నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్‌ వరకు తెలంగాణ, ఒడిశాల మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

అదే సమయంలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం అనకాపల్లి, కాకినాడ, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు, కృష్ణాజిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సామర్లకోటలో 7.8 సెంటీమీటర్లు, యలమంచిలిలో 7.7, కావలిలో 4.6, గుడివాడలో 4.2, మల్లాదిలో 3.7, ఉప్పలపాడులో 3.5 సెంటీమీర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు