ఏపీ: ఎస్‌ఈసీ పదవికి ముగ్గురి పేర్లు ప్రతిపాదన

25 Mar, 2021 03:37 IST|Sakshi
నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి , శామ్యూల్‌

గవర్నర్‌ కార్యాలయానికి పంపిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న నీలంసాహ్ని, మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు ఎం.శామ్యూల్, ఇంకో రిటైర్డ్‌ ఐఏఎస్, ప్రస్తుతం రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ విశ్వభూషణ్‌కు నివేదించింది.

ఈ ముగ్గరిలో గవర్నర్‌ ఎవరి పేరును ఆమోదిస్తే.. వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ఈ నియామకం జరిగితే వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయించి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  

మరిన్ని వార్తలు