ఈ పాపం ఎవరిదీ? 

17 Sep, 2020 08:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్‌ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు.  

గతంలో పాలక మండలి హయాంలోనే.. 
దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. 

వారిపై అనుమానాలు.. 
ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్‌ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్‌ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! 
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్‌ అహ్మద్‌ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.  

రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి 
ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్‌వీఎస్‌ఎస్‌ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు