నేలబావిలో పడిన బైక్‌ .. ముగ్గురు గల్లంతు

29 Jun, 2021 05:13 IST|Sakshi
నేలబావి నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నం

సురక్షితంగా బయట పడిన మరో విద్యార్థి

అంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు

తూర్పు గోదావరి జిల్లాలో ఘటన

రాజానగరం/మధురపూడి: బైక్‌ అదుపుతప్పి పాడుపడిన నేలబావిలో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఘటన తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, దోసకాయలపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోసకాయలపల్లికి చెందిన లలితపద్మాకుమారి కొడుకు గుమ్మడి సనీల్‌ (17), తుమ్మలపల్లి నుంచి సెలవులకు వచ్చిన తన చిన్నమ్మ కస్తూరి అచ్చుతరాణి కుమారుడు కస్తూరి అభిరామ్‌ (7)తో కలిసి బైక్‌పై గుమ్ములూరులో ఉంటున్న మరో చిన్నమ్మ చిన్నం పాప ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి వారి పిల్లలు  చిన్నం వీర్రాజు (17), చిన్నం శిరీష (13)తో కలిసి సోమవారం మధ్యాహ్నం ఒకే బైక్‌పై నలుగురు దోసకాయలపల్లికి బయలు దేరారు. అయితే ఈ మార్గంలోని పుంత రోడ్డు మలుపులో బైకును తిప్పే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పాడుపడిన నేలబావిలో పడిపోయారు.

ఇదే సమయంలో బైక్‌పై చివరన కూర్చున్న అభిరామ్‌ దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడిచ్చిన సమాచారం మేరకు.. వెంటనే గజఈతగాళ్లను రప్పించారు. డీఎస్పీ నార్త్‌ జోన్‌ కడలి వెంకటేశ్వర్రావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, సిబ్బందితోపాటు రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు గల్లంతు కావడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. మైనర్లు వాహనం నడపడం.. ఒకే బైక్‌పై నలుగురు  ఎక్కడం..రోడ్డు పక్కనే పాడుపడిన నేలబావిని పూడ్చకపోవడం ఈ దుర్ఘటనకు కారణమని భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు