రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్‌ 

18 Jan, 2023 13:22 IST|Sakshi

సాక్షి, నెల్లూరు(అర్బన్‌): జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి అధికారులపై వరుసగా వేటు పడుతోంది. ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్‌ ప్రమీలను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. తాజాగా వెంకటాచలం తహసీల్దార్‌ నాగరాజు, తోటపల్లిగూడూరు తహసీల్దార్‌ హమీద్, గుడ్లూరు తహసీల్దార్‌ లావణ్యను సస్పండ్‌ చేస్తూ కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

అవినీతికి అలవాటుపడిన అధికారులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చూపించి పరిహారం ఇవ్వడం, చివరికి మర్రిపాడు ప్రాంతంలో అటవీశాఖ భూములను సైతం పట్టా భూములుగా చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిపై చివరకు స్పందన కార్యక్రమంలో సైతం ప్రజలు తహసీల్దార్లు అర్జీలు సమర్పిస్తున్నారు. విషయాన్ని పరిశీలించిన కలెక్టర్‌ చక్రధర్‌బాబు విచారణాధికారిగా జేసీ కూర్మనాథ్‌ను నియమించారు.

జేసీ విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగు చూశాయి. కలువాయి మండలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులదిగా చూపి అక్రమార్కులకు అండగా నిలిచారు. గుడ్లూరు మండలంలో ప్రభుత్వ భూమిని మ్యుటేషన్‌ చేశారు. ఇలా పలు చోట్ల అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లను గుర్తించి సస్పెండ్‌ వేటు వేశారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. మరో ఆరుగురిని విచారించేందుకు జేసీ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రిటైర్డ్‌ అయిన రెవెన్యూ అధికారులు సైతం ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది.  

చదవండి: (విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు)

మరిన్ని వార్తలు