ఎన్నాళ్లో వేచిన ఉదయం!

30 Oct, 2020 07:24 IST|Sakshi

ఆఫ్రికా దేశం లిబియాలో కిడ్నాపర్ల బారినపడ్డ శ్రీకాకుళం జిల్లా యువకులు 

రాష్ట్ర ప్రభుత్వం కృషి, చొరవతో ఎట్టకేలకు స్వగ్రామం చేరిక 

సంతబొమ్మాళి: దేశంకాని దేశంలో చిక్కుకున్న తమ వాళ్లు ఎప్పుడొస్తారో అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని లిబియా బాధితుల కుటుంబాల కల ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర ప్రభుత్వం కృషి, చొరవతో ఆఫ్రికా దేశం లిబియాలో చిక్కుకున్న ముగ్గురు జిల్లా యువకులకు విముక్తి కలిగింది. గురువారం స్వగ్రామమైన సీతానగరంలో అడుగుపెట్టిన బాధితులు తీవ్ర భావోద్వేగానికి లోనై తమ కుటుంబ సభ్యులను హత్తుకొని ఆనందభాష్పాలు కార్చారు. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్‌ 30న లిబియా వెళ్లారు. అక్కడ కంపెనీలో 11 నెలలపాటు పనిచేశారు. తిరిగి భారత్‌ వచ్చేందుకు సెపె్టంబర్‌ 14న లిబియా రాజధాని ట్రిపోలి ఎయిర్‌పోర్టుకు కారులో వస్తుండగా మార్గమధ్యంలో దుండగులు కిడ్నాప్‌ చేశారు.

బాధితుల కుటుంబసభ్యులు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తెచ్చారు. వారు వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమాచారాన్ని చేరవేశారు. సీఎం చొరవ, కృషితో లిబియాలోని భారత రాయబార కార్యాలయం.. కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలా ప్రయతి్నంచింది. దీంతో 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి యువకులు బయటపడ్డారు. బుధవారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో చేరిన యువకులు గురువారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కి విశాఖపట్నం చేరారు. అక్కడి నుంచి కారులో స్వగ్రామమైన సీతానగరం చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మార్గమధ్యంలో యువకులు ఎస్పీ అమిత్‌ బర్దార్‌ను కలిసి జరిగిన ఘటనను వివరించారు.  

మళ్లీ చూస్తామనుకోలేదు.. 
బతుకుతెరువుకు లిబియా వెళ్లి కిడ్నాప్‌కు గురయ్యాం. ఎన్నో అవస్థలు పడ్డాం. మళ్లీ మావారిని చూస్తామనుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో మళ్లీ స్వగ్రామంలో అడుగుపెట్టాం.  
– బత్సల జోగారావు, బొడ్డు దానయ్య, బత్సల వెంకటరావు, లిబియా బాధితులు

సీఎం వైఎస్‌ జగన్‌కు మా కృతజ్ఞతలు 
దేశం కాని దేశం వెళ్లి తిరిగి వస్తుండగా కిడ్నాప్‌ కావడంతో చాలా భయపడ్డాం. ఏమైందో అని ఆందోళన చెందాం. వెంటనే ప్రభుత్వం స్పందించి విముక్తికి సహకరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు రుణపడి ఉంటాం.  
– బొడ్డు దానయ్య, కుటుంబ సభ్యులు, సీతానగరం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు