అదిగో.. పిడుగు!

5 May, 2022 03:16 IST|Sakshi

రాష్ట్రంలో ఏటా 12 నుంచి 15 లక్షల పిడుగులు 

సగానికిపైగా ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లోనే.. ఈ ఏడాది ఇప్పటిదాకా 10 మంది మృతి

ముందే అప్రమత్తం చేస్తున్న విపత్తుల శాఖ

సాక్షి, అమరావతి: నడి వేసవిలో పిడుగులు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పిడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి, దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు, పిడుగులు పడుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గత మూడు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడగా మంగళవారం ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు పది మంది పిడుగుపాటుతో మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ నిర్థారించింది. అన్నమయ్య, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి.

ఈ మూడు నెలల్లోనే..
ఏప్రిల్, మే, జూన్‌ నెలలు పిడుగుల సీజన్‌. సంవత్సరం మొత్తం మీద 10 నుంచి 15 లక్షల పిడుగులు పడితే ఈ మూడు నెలల్లోనే 5 నుంచి 7 లక్షల పిడుగులు పడతాయి. శాటిలైట్‌ సమాచారం, ఇతర మార్గాల ద్వారా క్యుములోనింబస్‌ మేఘాలను బట్టి పిడుగుల సంఖ్యను లెక్కిస్తారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2018లో అత్యధికంగా 137 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

ఎలా ఏర్పడతాయి?
ఉత్తర భారత దేశం నుంచి వీచే పొడి గాలులు, సముద్రం నుంచి వచ్చే తడి గాలులు కలసి మేఘాలుగా ఏర్పడతాయి. నిటారుగా ఉండే వీటిని క్యుములోనింబస్‌ మేఘాలుగా పిలుస్తారు. అవి ఏర్పడినప్పుడు కచ్చితంగా పిడుగులు పడతాయి. ఈ మేఘాల కిందభాగంలో తడి, పైభాగంలో పొడి గాలులు ఉంటాయి. ఒక మేఘంపైన మరో మేఘం ఆవరించి ఢీ కొన్నప్పుడు తడి, పొడి గాలుల ప్రతిస్పందనకు పిడుగులు పడతాయి. 

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..  
ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువులకు దూరంగా వెళ్లాలి. రేకు, లోహంతో చేసిన నిర్మాణాల వద్ద ఉండకూడదు. ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. కారు, బస్సులో ఉంటే అన్ని డోర్లు మూసివేయాలి. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పుడు మెడ వెనుక జుత్తు నిక్కబొడవడం లేదా చర్మం జలదరింపు ఉంటే పిడుగుపాటుకు సంకేతంగా భావించి అప్రమత్తం కావాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసివేయాలి. పిడుగుపాటు సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించకూడదు. స్నానం, చేతులు కడగడం, నీటిలో గడపడం చేయకూడదు. మోటార్‌ సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, విద్యుత్‌ స్తంభాలు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉంటే లోహపు భాగాలను తాకరాదు. 

పిడుగును గుర్తించే సెన్సార్లు
ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందో హెచ్చరిస్తూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలను ముందే అప్రమత్తం చేస్తోంది. అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్‌వర్క్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రంలో పిడుగుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 11 సెన్సార్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు