పూడిక తొలగింది.. నీరు పెరిగింది

27 Jan, 2021 09:23 IST|Sakshi

తుంగభద్ర డ్యామ్‌ సామర్థ్యం 105.79 టీఎంసీలకు పెరుగుదల

2008లో 100.85 టీఎంసీలే

టోపోగ్రాఫిక్, బ్యాథిమెట్రిక్‌ తాజా సర్వేలో వెల్లడి

తాజా నిల్వ సామర్థ్యం ప్రకారం పంపిణీ చేయాలని ఏపీ సర్కారు ప్రతిపాదన

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్‌ అయిన తుంగభద్ర డ్యామ్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలుగా తేలింది. 2008లో ఇది 100.85 టీఎంసీలు కాగా.. గడచిన పుష్కర కాలంలో వరద ప్రవాహం వల్ల డ్యామ్‌లో పూడిక తొలగడంతో నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగింది. తుంగభద్ర బోర్డు ఇటీవల డ్యామ్‌లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు చేయించిన టోపోగ్రాఫిక్‌ (స్థలాకృతి), బ్యాథిమెట్రిక్‌ (నీటి లోతు) సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ దృష్ట్యా వచ్చే బోర్డు సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని ఖరారు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా నీటి నిల్వ సామర్థ్యం మేరకు.. మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేయాలని తుంగభద్ర బోర్డును ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరింది.

తొలినాళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు
1944లో బ్రిటిష్‌ సర్కార్‌ పాలనలో మద్రాసు, హైదరాబాద్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కర్ణాటకలో హోస్పేట్‌ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్‌ నిర్మాణం చేపట్టారు. 1953 నాటికి నిర్మాణం పూర్తికాగా.. అప్పట్లో నిర్వహించిన సర్వేలో డ్యామ్‌ పూర్తి సామర్థ్యం132.47 టీఎంసీలని తేలింది. డ్యామ్‌ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), తెలంగాణకు 6.51 చొప్పున మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేస్తూ వస్తోంది.

ఏటా 0.57 టీఎంసీల తగ్గుదల
ఏటా ప్రవాహంతో కలిసి డ్యామ్‌లోకి మట్టి చేరుతూ వస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు డ్యామ్‌లో నీటి నిల్వ ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు తొలిసారిగా 1963లో తుంగభద్ర బోర్డు సర్వే చేయించింది. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని అప్పట్లో బోర్డు తేల్చింది. పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నదిలో వరద రోజులు తగ్గడంతో డ్యామ్‌ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని గుర్తించిన బోర్డు నీరు లభించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలో 2008లో నిర్వహించిన సర్వేలో డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే 1953 నుంచి 2008 వరకూ 55 ఏళ్లలో 21.62 టీఎంసీల మేర తగ్గింది. 1953 నుంచి 2008 వరకూ వివిధ సందర్భాల్లో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏటా 0.57 టీఎంసీల మేర తగ్గుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలావుంటే.. 2008 తర్వాత వివిధ సందర్భాల్లో డ్యామ్‌కు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరగా.. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేశారు. ఆ వరద ప్రవాహంలో డ్యామ్‌లోని పూడిక కొంతమేర తొలగిపోయినట్టు తాజా సర్వేల్లో వెల్లడైంది. దాంతో నీటి నిల్వ సామర్థ్యం 2008లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజాగా 4.94 టీఎంసీల మేర పెరిగినట్టు తేలింది. వచ్చే సమావేశంలో మూడు రాష్ట్రాల అధికారులతో తుంగభద్ర బోర్డు చర్చించి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించనుంది. 

మరిన్ని వార్తలు