కోలాహలంగా టిడ్కో గృహప్రవేశాలు

2 Aug, 2022 03:32 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

కర్నూలు వైఎస్సార్‌ జగనన్న కాలనీలో కార్యక్రమం 

ముఖ్యఅతిథులుగా మంత్రులు బుగ్గన, సురేష్, జయరాం 

కర్నూలు (సెంట్రల్‌): వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పట్టణ పేదలకు రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి కానుకగా ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల గృహాలకు రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.10,400 కోట్ల భారం పడిందన్నారు. అయినా వైఎస్‌ జగన్‌ సర్కారు పేదల కోసం ఈ భారాన్ని భరిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 30 వేల గృహాలను అందజేసినట్లు చెప్పారు. సోమవారం కర్నూలులో వైఎస్సార్‌ జగనన్న నగర్‌లో టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం జరిగింది.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక  శాఖ మంత్రి జయరాం ముఖ్యఅతిథులుగా హాజరై దాదాపు 5 వేల మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో 300 చదరపు అడుగులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదట రూ.500 కడితేనే రిజిస్ట్రేషన్‌ చేసే వారని తెలిపారు. తరువాత ఆ ఇంటికి రూ.2.62 లక్షలు అప్పు ఇప్పించే వారన్నారు. దీనిని 20 ఏళ్లపాటు లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చేదన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం పేదలపై మోపిన ఈ భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకుందని అన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు కేవలం ఒక్క రూపాయికే టిడ్కో గృహాన్ని పేద మహిళలకు ఆస్తిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం చంద్రబాబు 2018లో టిడ్కో గృహాల నిర్మాణం ప్రారంభించగా ఎక్కడా పూర్తి కాలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. గ్యాస్, పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెరగడానికి, తమ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ బాదుడే బాదుడుకు బదులుగా ఏడుపే ఏడుపు కార్యక్రమాన్ని చేపడితే మంచిదని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ రామయ్య, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, వై.సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు