టైర్‌–2, 3 నగరాలకు ప్రాధాన్యత

5 Feb, 2023 05:17 IST|Sakshi

వీటికి కేంద్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయింపు

జనసాంద్రత, సౌకర్యాల ఆధారంగా కేటగిరీలుగా విభజన

రాష్ట్రంలో ఉన్నవన్నీ టైర్‌–2, టైర్‌–3 నగరాలే

దేశంలో టైర్‌–1 నగరాలు ఎనిమిదే

సాక్షి, అమరావతి: ‘దేశంలోని టైర్‌ 2, టైర్‌ 3 నగరాలకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు’.. బుధవారం కేంద్రం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ఇది. దేశంలోని నగరాలను మహా నగరాలు, మెట్రో నగరాలు, మెగా సిటీలు, చిన్న సిటీలు అంటూ రకరకాలుగా పిలుస్తుంటాం. వీటిలో ఈ టైర్‌ 1, 2, 3.. ఇలా విభజన ఏమిటి?..  ఇదీ ఇప్పుడు జరుగుతున్న ఆసక్తి­కర చర్చ.

అదేమిటో మనమూ ఓసారి చూద్దాం.. దేశంలో మహా నగరాలు, నగరాలు, పట్టణాలు చాలా ఉన్నాయి. వీటిలో ఏవి టైర్‌ 1, ఏవి టైర్‌ 2, టైర్‌ 3? వీటిని ఎలా విభజన చేస్తారన్న విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ ‘టైర్‌’ విధానం మొదట రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2007లో మొదలైంది.

పది లక్షలు మించిన జనాభా ఉన్న నగరాలను టైర్‌ 1 గా, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్‌ 2 సిటీలుగా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాటిని టైర్‌ 3 గా పేర్కొన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం 5 వేల నుంచి లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాలను ఆరు విభాగాలు (టైర్‌)గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో టైర్‌ 1 విభాగంలో 8 నగరాలు ఉన్నాయి. టైర్‌ 2 విభాగంలో 104 నగరాలు చేరాయి. మిగిలినవి టైర్‌ 3 కేటగిరీలో ఉన్నాయి.

టైర్‌ 2, 3 నగరాల అభివృద్ధిపై దృష్టి
కరోనా సమయంలో అనుసరించిన వర్క్‌ ఫ్రం హోం విధానంలోని ప్రయోజనాలను పరిశ్రమలు గ్రహించాయి. టైర్‌ 1 సిటీలుకంటే తమ పెట్టు­బడులకు టైర్‌ 2 సిటీలు మేలని, వీటిలో జీవన వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వర్క్‌–లైఫ్‌ మధ్య సమతుల్యత మెరుగ్గా ఉన్నట్టు గుర్తించాయి. పైగా, అనువైన ధరల్లో అద్దె ఇళ్లు లభ్య­మవడం, ఖర్చులు కూడా బడ్జెట్‌లో ఉండటంతో ఈ సిటీలపై ఆసక్తి చూపుతున్నాయి.

దాంతో టైర్‌ 2 సిటీల్లో మౌలిక వసతులు కల్పించ­డం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించ­వచ్చని ఆర్థిక­వేత్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని టైర్‌ 2 సిటీ­లైన విశాఖపట్నం, నెల్లూరులో పలు సాఫ్ట్‌వేర్‌ కం­పెనీలు, అంతర్జాతీయ పరిశ్రమలు సైతం తమ వ్యాపారాలకు కేంద్రంగా ఎంచుకున్నాయి. టైర్‌ 2, 3 నగరాల్లో ప్రాధాన్యత రంగాలను ప్రోత్స­హించేందుకు రూ.10 వేల కోట్లతో అర్బన్‌  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (యూఐడీ­ఎఫ్‌) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రక­టిం­­చారు.

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఉండే ఈ ఫండ్‌ను పట్టణ మౌలిక సదుపాయాల కోసం స్థానిక పట్టణ సంస్థలు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతు­న్నారు. దీని ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, గ్రేడ్‌ 2 మున్సిపాలిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. 

టైర్‌ 1 నగరాలివీ..
అధిక జనాభా, ఆధునిక వసతులతో ఉన్నవి టైర్‌ 1 (జెడ్‌ కేటగిరీ) విభాగంలోకి వస్తాయి. వీటిని మెట్రోపాలిటన్‌ నగరాలుగా పిలుస్తారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే టైర్‌ 1 విభాగంలో ఉన్నాయి. ఈ నగరాల్లో అధిక జనసాంధ్రతతోపాటు అంతర్జాతీయ విమానా­శ్రయాలు, పరిశ్రమలు, టాప్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, విద్య, పరిశోధన సంస్థలు ఉంటాయి. ఈ నగరాల్లో జీవన వ్యయమూ అధికంగా ఉంటుంది. వీటిని బాగా అభివృద్ధి చెందిన నగరాలుగా చెప్పవచ్చు.

టైర్‌ 2 సిటీలు
భారతదేశంలో 104 నగరాలు టైర్‌ 2 విభాగంలో ఉన్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. అయితే, టైర్‌ 1, టైర్‌ 2 నగరాల మధ్య పెద్దగా తేడా లేదని అర్బన్‌ ప్లానర్లు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నగరాల్లో జీవన శైలి, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, జీవన వ్యయం మాత్రం టైర్‌ 1 సిటీలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని అంచనా. పెట్టుబడులకు, అంతర్జాతీయ వ్యా­పార సంస్థలకు ఈ నగరాలు అను­వైనవిగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతు­న్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు టైర్‌ 2 సిటీలుగా ఉన్నాయి. 

టైర్‌ 3 నగరాలు అంటే..
టైర్‌ 2 ఉన్నవి తప్ప మిగిలిన నగరాలు, పట్టణాలను టైర్‌ 3 విభాగంలో చేర్చారు. ఒకవిధంగా చెప్పాలంటే గ్రేడ్‌ 2, 3 మున్సిపాలిటీలు వీటి పరిధిలోకి వస్తాయి. ఈ పట్టణాల్లో వసతులను మెరుగుపచడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు