తల్లి కోసం పులి కూనల కలవరం

8 Mar, 2023 04:17 IST|Sakshi

రెండు రోజులు గడిచినా జాడలేని పెద్ద పులి

తల్లి చెంతకు చేర్చేందుకు అధికారుల ముమ్మర ప్రయత్నాలు

ఇప్పటికే 70 ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల ఏర్పాటు

మనుషులు తాకిన పిల్లలను తల్లి పులి తిరస్కరించే అవకాశం!

జాప్యం జరిగితే కూనలు మర్చిపోయే ఛాన్స్‌

శాస్త్రీయ పద్ధతుల్లో తల్లి వద్దకు తప్పక చేరుస్తామని అధికారుల ధీమా

ఆత్మకూరు రూరల్‌: నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది.

పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్‌ఫ్రారెడ్‌ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి³ పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్‌ నుంచి వదులుతారు.

ఆ నాలుగూ ఆడ కూనలే
పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే  ప్రధాన పాత్ర. గుమ్మడాపురంలో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఒక ఆడపులి తన జీవిత కాలంలో (అడవిలో అయితే 18 ఏళ్లు) 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. 

చేరదీస్తుందో.. లేదో!
వన్యప్రాణుల్లో పెద్ద పులి, దొమ్మల గొండి (హైనా) తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు రానీయవు. పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలను తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. కాగా, మనిషి ముట్టిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరిస్తున్నారు. దీంతో పులి పిల్లల వంటిని తడపనున్నారు. 

అన్ని సందర్భాల్లో వర్తించదు
మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ పేర్కొన్నారు. తల్లికి, పిల్లలకు మధ్య ఉండే బలమైన బంధం, ప్రత్యేక పరిస్థితులు దీనికి మినహాయింపు కావచ్చన్నారు. అందువల్ల పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 

శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభిస్తాం
పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి చెప్పారు.  ఆత్మకూరులోని అటవీ శాఖ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్‌లో గర్భంతో ఉన్న పులిని ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల్లో గుర్తించామన్నారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని  వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చన్నారు.

తిరుపతి శ్రీవెంకటేశ్వర  జంతు ప్రదర్శన శాల వన్యప్రాణి వైద్య నిపుణులు డాక్టర్‌ తోయిబా సింగ్‌ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారన్నారు. కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా నిబంధనలు,  మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అలెన్‌ చోంగ్‌ టెరాన్, విఘ్నేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు