భయంగుప్పిట్లో ఏజెన్సీ

30 Dec, 2020 08:34 IST|Sakshi
ఘటనా స్థలం వద్ద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న గిరిజనులు, (అంతరచిత్రం) పులిదాడిలో మృతిచెందిన ఎద్దు

ఇసుకపాడులో ఎద్దును చంపిన పులి

పాదగుర్తుల ఆధారంగా కళేబరం గుర్తింపు

సీసీ కెమెరాలు, బోనుల ఏర్పాటుకు చర్యలు

సాక్షి, కుక్కునూరు: ఏజెన్సీ గ్రామాలు పులి భయంతో వణుకుతున్నాయి. సోమవారం కుక్కునూరు మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ అటవీప్రాంతం నందిపాడు సమీపంలో ఎద్దును చంపిన పులి మంగళవారం మండలంలోని ఇసుకపాడు గ్రామానికి చేరింది. ఈ గ్రామంలోని కంటిపల్లి నాగులు అనే గిరిజన రైతుకు చెందిన పొలం వద్ద ఉన్న పశువుల కొట్టంపై దాడి చేసి ఒక ఎద్దును చంపింది. అనంతరం ఆ ఎద్దును కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది. ఉదయాన్నే పశువుల కొట్టంలో ఉన్న పశువులు లేకపోవడాన్ని రైతు గమనించాడు. ఆ ప్రాంతంలో రక్తం, పులి పాదగుర్తులు ఉండటంతో ఆ ప్రాంతాన్ని గ్రామస్తులంతా గాలించి ఎద్దు కళేబరాన్ని కనుగొని పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎద్దుపై దాడి జరిగినట్లు నిర్ధారించారు. పాదముద్రలను సేకరించారు. అయితే దాడి చేసి జంతువు పులా లేక చిరుత పులా అన్నది నిర్ధారించాల్సి ఉందని అటవీశాఖాధికారులు తెలిపారు. ఈ విషయమై కుక్కునూరు రేంజర్‌ ఎం.ఏడుకొండలను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఘటనా స్థలం వద్ద పాదముద్రలు సేకరించి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం నుంచి అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఏజెన్సీ గ్రామ ప్రజలు 15 రోజుల పాటు అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదని, పశువులను అడవుల్లోకి వదిలిపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి బోనులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు