పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్‌...

15 Mar, 2023 15:19 IST|Sakshi

పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్‌. ఇది వన్యమృగం.. అయినా సౌమ్యం వీటి సొంతం. అయితే నల్లమల పులి జీవనం వైవిధ్యం. పులులు సంఘజీవులు కావు. ఒంటరిగా బతికేందుకు ఇష్టపడతాయి. ఇతర జంతువులతో కలవడం చాలా అరుదు. ఇవి ఆహారం కోసం వన్యప్రాణులను వేటాడడం.. పిల్లల్ని కనడం.. వాటికి జీవన మెళకువలు నేర్పడం.. ఆ తర్వాత అరణ్యంలో బతికేందుకు వదిలేయడం అంతా విభిన్నంగా ఉంటుంది. సువిశాల విస్తీర్ణంలో నెలకొన్న ఎన్‌ఎస్‌టీఆర్‌ (నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌)లో ఉంటే పులులతో పాటు ఇతర టైగర్‌ ఫారెస్ట్‌ల్లో ఉండే వాటికంటే చాలా సౌమ్యంగా ఉంటాయి. బఫర్‌ ఏరియాలను దాటి జనారణ్యంలోకి తరుచూ వచ్చినా మనుషులపై దాడులు చేసిన ఘటనలు అరుదు. ఇక్కడ ఉండే పులులు సాధువుగా ఉంటాయని అంటున్నారు వన్యప్రాణుల పరిశోధకులు. 

జీవ వైవిధ్యానికి నెలవుగా ఉండే నల్లమల అభయారణ్యం 3,700 చదరపు కిలో మీటర్ల మేర ఎన్‌ఎస్‌టీఆర్‌ విస్తరించి ఉంది. దేశంలోనే అతి పెద్ద టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఇది. దీని చుట్టూ వందలాది గిరిజన గూడేలు ఉన్నాయి. ఇక్కడ నివశించే పులి నల్లమల రాజుగా పేరొందింది. అంతరించిపోతున్న వీటి సంరక్షణకు, వీటి సంతతిని పెంచేందుకు అటవీశాఖ అధికారులు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారికంగా 75 పులులు ఉన్నాయని గుర్తించినా అనధికారికంగా 100కు పైగా ఉన్నాయని అంచనా. ఈ ఏడాది కూడా పులుల గణన ప్రారంభమైంది. ఏప్రిల్‌ నెల చివరి వరకూ వివిధ దశల్లో వీటిని లెక్కింపు చేస్తారు.  

మృగమే కానీ.. 
సాధారణంగా అటవీ ప్రాంతానికి సమీప గిరిజన గూడేలకు మధ్య బఫర్‌ ఏరియా ఉంటుంది. వన్యప్రాణులు, మృగాలు జనావాసాల వైపు రాకుండా ఉండేలా ఒక అంచనా వేస్తూ బఫర్‌ ఏరియాలను నిర్ణయించారు. అయితే మనుగడ కోసం గిరిజన ప్రాంతాల్లోని వారు బఫర్‌ ఏరియాలను దాటి ముందుకు వచ్చేశారు. దీంతో తరుచూ వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. నల్లమల రాజుగా పేరొందిన పులులు ఇతర టైగర్‌ ఫారెస్టుల్లో ఉన్న పులులు కంటే చాలా సాధుగుణం కలిగి ఉంటాయి. తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్‌లో ఉన్న తడోబా టైగర్‌ ఫారెస్టులోని పులులు నిత్యం మనుషులపై దాడులు చేస్తుంటాయి. నెలకు ఒకరిద్దరిని పొట్టన పెట్టుకుంటుంటాయి. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎన్‌ఎస్‌టీఆర్‌లో మాత్రం పులులు తరుచూ జనారణ్యంలోకి వచ్చినా మనుషులపై దాడులు చేయడం చాలా అరుదు.

మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే 0.001 శాతం మాత్రమే దాడి చేసి ఉంటాయని వన్యప్రాణి నిపుణులు అంటున్నారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఒక పులి సంచరించేందుకు 30 నుంచి 40 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఇతర వన్యప్రాణులను వేటాడుతూ..  లేదా నీళ్ల కోసం బఫర్‌ ఏరియాలను దాటి గూడేల వైపు ఇవి వస్తుంటాయి. గత నెలలో గిద్దలూరు అటవీ డివిజన్‌ పరిధి మాగుటూరు, లక్ష్మీపురం, వెలగలపాయ, శంకరాపురం, కాకర్ల తదితర గ్రామాల పరిధిలోనూ, మార్కాపురం అటవీ డివిజన్‌ పరిధిలోని యర్రగొండపాళెం మండలం కొలుకుల గ్రామం పరిధిలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. వీటి దాడిలో ఎద్దులు సైతం మృతి చెందాయి. పులుల సంచారాన్ని గుర్తించేందుకు అధికారులు ట్రాప్‌ కెమెరాలు అమర్చారు. పెద్దపులి దాడి చేసిన ఎద్దు మృతదేహం వద్దకు వచ్చి కళేబరాన్ని తింటుండటం కెమెరాలో నిక్షిప్తమైంది. ఒక పులి తన పిల్లలతో వచ్చినట్టు కూడా గుర్తించినట్టు సమాచారం. 

పులుల సంతతి పెరిగేందుకు.. 
ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంతతి పెరిగేందుకు ఆగస్టు, సెపె్టంబర్‌ రెండు నెలల పాటు పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. ఆ సమయంలో పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కలుగుతుంది. మగ పులి, ఆడపులి కలిసేందుకు అది అనుకూలమైన సమయంగా అధికారులు గుర్తించారు. పులులకు సూపర్‌ సెన్స్‌ ఉంటుంది. ఆడపులి రాకను మగపులి 30 కిలో మీటర్ల దూరం నుంచే గుర్తిస్తుంది. ఆడపులి ఒక చెట్టును బరకడం, మూత్ర విసర్జన చేస్తుంది. ఆ సమయంలో విడుదలైన రసాయనాల వాసనను మగపులి గుర్తిస్తుంది. ఆడ పులితో మేటింగ్‌ తర్వాత వారం రోజులు ఉండి మగ పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గర్భం దాల్చిన ఆడపులి 103 రోజుల తర్వాత పిల్లలకు జన్మనిస్తుంది.

వాటిని ఇతర వన్యమృగాల బారిన పడకుండా అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచి ఆహారానికి వెళుతుంది. అవి కళ్లు తెరిచే వరకు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ఒక నెల తర్వాత వేటాడడం నేర్పుతోంది. ఇలా 18 నెలల పాటు వాటికి అన్ని రకాల మెళకువలు నేర్పి వదిలేస్తోంది. అలా తల్లి నుంచి వేరైన పులులు సొంతంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. పిల్లలు తనతో ఉన్నంత వరకు మగపులిని మేటింగ్‌కు ఆహ్వానించదు. అవి పిల్లలతో ఆహారం నిమిత్తం పొరపాటున జనారణ్యంలోకి వచ్చిన సమయంలో పులి కూనలను మనుషులు తాకితే ఇక వాటిని తల్లి పులి దగ్గరకు రానివ్వదు. ఇటీవల నంద్యాల జిల్లాలో పిల్లలతో కలిసి జనారణ్యంలోకి పులి వచ్చింది. నాలుగు కూనలు ఆరు బయట ఉండడంతో వాటిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు వివరాలు అందించారు. ఈ సమయంలో వాటిని మనుషులు ముట్టుకోవడంతో వాటి కోసం తల్లి పులి రాలేదని తెలుస్తోంది.   

పులుల సంరక్షణకు..  
నల్లమల అభయారణ్యంలో నాలుగు డివిజన్లు, 16 నుంచి 20 రేంజ్‌లు ఉన్నాయి. అటవీ సమీపంలో ఉండే చెంచులకు అభయారణ్యంలోని జంతువుల గురించి పూర్తిగా తెలుసు. పెద్ద పులి ఎక్కడ ఉంది.. అది ఏం చేస్తుందనేది దూరం నుంచే పసిగడతారు. మనకంటే వారికే ఎక్కువగా తెలుసు. కొన్ని సందర్భాల్లో అటవీశాఖ సిబ్బందినే గైడ్‌ చేస్తారు. అందుకే వారిని ప్రొటెక్షన్‌ వాచర్లుగా, స్ట్రైక్‌ ఫోర్సులుగా నియమించారు. మొత్తం 600 మందికి ఉద్యోగాలు ఇచ్చి రక్షణగా నియమించారు. వేసవిలో వన్యప్రాణులకు నీటిఎద్దడి లేకుండా అవసరమైన చోట్ల సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు నీటితో నింపుతున్నారు. 

పులుల గణన ప్రారంభం  
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పులుల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఉండే పులులు శేషాచలం అడవులకు వెళ్లి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. వివిధ దశల్లో 80 రోజుల పాటు డేటాను సేకరిస్తారు. ఫిబ్రవరి 20 నుంచి 20 రోజుల పాటు నంద్యాల, పోరుమామిళ్ల, లంకలమల, శేషాచలం కారిడార్‌లో వివరాలు సేకరించారు. మార్చి 11 తర్వాత మిగతా ఏరియాలో కెమెరాలను బిగించి మరో 20 రోజుల పాటు మార్చి 31 వరకు డేటాను సేకరిస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 20 వరకు ఆత్మకూరు, మార్కాపురం డివిజన్‌లో ఏప్రిల్‌ 21 నుంచి మే 10 వరకూ డేటాలను సేకరిస్తారు. వీటి ఆధారంగా పులుల సంఖ్యను లెక్కిస్తారు.  

పక్కాగా గణన  
పులుల గణన పక్కాగా సేకరిస్తున్నాం. ఎక్కడికక్కడ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రొటెక్షన్‌ వాచర్లను నియమించాం. వేసవిలో వాటికి నీటి అవసరాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 120 సాసర్‌ పిట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఉంచాం.  
– మహ్మద్‌ హయత్, ఎఫ్‌ఆర్‌ఓ, బయోడైవర్శిటీ కేంద్రం, శ్రీశైలం  

మరిన్ని వార్తలు