ఉచ్చులు కావు.. ఉరితాళ్లు

12 Jun, 2022 18:12 IST|Sakshi

నల్లమలలో పులుల అసాధారణ మరణాలు

పులి సంచార ప్రాంతాల్లో  ఉచ్చుల బెడద

2018 నుంచి 6 పులుల మరణం

అధికారులు చెబుతున్న కారణాలపై అనుమానాలు

ఆత్మకూరురూరల్‌:  నల్లమల అటవీ పరిధిలో జరిగిన పైమూడు ఘటనలు పులులు ఉచ్చులకు బలవుతున్నట్లు తేటతెల్లమవుతోంది. అడవిలో పెద్దపులి, చిరుత పులి మరణించినప్పుడు వృద్ధాప్యంతో, ప్రమాదవశాత్తూ, రెండు పులుల పోరాటంలో గాయపడి మృత్యువాత పడినట్లు అటవీ అధికారులు తరచూ  చెబుతూ ఆ అంకాన్ని ముగిస్తుంటారు. అయితే పులుల అసహజ మరణాల వెనుక వేటగాళ్ల ఉచ్చులు ఉన్నట్లు అటవీ సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వన్యప్రాణుల మాంసానికి డిమాండ్‌ ఉండడంతో ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లె, రుద్రవరం, మహానంది మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడం వృత్తిగా మార్చుకున్నారు.

తనిఖీల్లో తరచూ వన్యప్రాణి మాంసం లభిస్తున్న కేసుల సంఖ్యనే ఇందుకు బలం చేకూర్చుతోంది. శ్రీశైలం – నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) మన నల్లమలలో ఏర్పడి పులుల సంరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. సుమారు 110 పెద్దపులులకు (తెలంగాణా– ఆంధ్రప్రదేశ్‌) నెలవై శ్రీశైలం – శేషాచలం పులుల కారిడార్‌కు ఎన్‌ఎస్‌టీఆర్‌ పురుడు పోసింది. కాగా ఇటీవలి కొన్ని పరిణామాలను చూస్తే అటవీ శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగేళ్లలో ఆరు పులులు అసాధారణ స్థితిలో మరణించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.  సాధారణంగా పెద్ద పులి ఉద్ధృతంగా ప్రవహించే కృష్ణానదిని అవలీలగా దాటేస్తుంది. అలాంటిది తెలుగు గంగలో పడి మృతి  చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించడం అనుమానాలకు దారి తీస్తుంది. వేటగాళ్లను కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

జింకల కోసం ఉచ్చులు.. పులులకు చిక్కులు..  
నల్లమల అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించడమే ఒక వ్యాపారంగా మలుచుకుని జీవిస్తుంటారు. ముఖ్యంగా కొత్తపల్లె, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, రుద్రవరం మండలంలో కొందరు నేరచరిత్ర ఉన్న వ్యక్తులు నిరంతరం ఇదే పనిలో ఉంటున్నారు. అతికొద్ది మంది తుపాకులతో వేట సాగిస్తే చాలా మంది ఉచ్చులతో వేటాడుతున్నారు. వీరు వేస్తున్న ఉచ్చులే పులుల ఉనికికే ప్రమాదంగా మారాయి. ఉచ్చులతో వేటకు వేసవికాలం అనుకూలం. సహజనీటి వనరులు తరిగిపోయి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉండే నీటి దొరువుల వద్ద వేటగాళ్లు పొదల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. నీటి కోసం వచ్చే జింకలు ఈ ఉచ్చుల్లో చిక్కుకుని మరణిస్తుంటాయి. అలాగే జింకలు తమకు అవసరమైన సోడియం లవణ లభ్యత కోసం అడవుల్లో ఉండే జేడె (ఉప్పు నేలలు)లను ఆశ్రయిస్తాయి. వెన్నెల రాత్రులలో జేడెల వద్దకు భూమి పొరలను నాకేందుకు  గుంపులు గుంపులుగా చేరుకుంటాయి. ఆ ప్రాంతాల్లో కూడా వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. ఇలా జింకల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులలో పెద్దపులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు చిక్కుకుని బలవుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రుద్రవరం అటవీ ప్రాంతంలోని గండ్లేరు రిజర్యాయరులో పులి కళేబరం బయటపడింది. తెలుగుంగ కాల్వలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు మొదట అధికారులు ధ్రువీకరించారు. అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా పచ్చర్ల సమీపంలో ఉచ్చులో పడి మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటనలో కింది స్థాయి అటవీ సిబ్బందిపై వేటు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.   

2018 మార్చి 28న శ్రీశైలం రేంజ్‌లోని పెచ్చెర్వు సమీపంలో నరమామిడి చెరువు వద్ద పెద్దపులి మరణించింది. గుర్తించిన అటవీ సిబ్బంది అర్ధరాత్రి అక్కడే పోస్టుమార్టం చేసి కళేబరాన్ని దహనం చేశారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో మృత్యువాత పడినట్లు ప్రకటించారు. అయితే అధికారుల హడావుడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెద్ద పులి ఉచ్చుకు బలైనా అధికారులు దాచి కళేబరాన్ని దహనం చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.  

2016లో జీబీఎం, నాగలూటి రేంజ్‌లలో కనిపించిన (ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల్లో) టీ 21, టీ 32, టీ40 (పులి శరీరంపై ఉన్న చారల ఆధారంగా వాటికి ఓ 
సంఖ్య కేటాయిస్తారు) జాడ ఇంత వరకు లేదు. దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఐనముక్కలలో ఓ ఇంట్లో మూడు పులి చర్మాలు లభించాయి. వాటిని సున్నిపెంటకు చెందిన ఓ వ్యక్తి దాచినట్లు తేలగా.. ఈ కేసులో ఆత్మకూరు మండలం సిద్ధేశ్వరానికి చెందిన వేటగాడిని అరెస్ట్‌ చేశారు.  

 అటవీ చట్టాలు కఠినంగా అమలు చేయాలి 
వన్యప్రాణి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. పులి మనుగడకు ముప్పుగా మారిన ఉచ్చుల వేట పూర్తిగా నిర్మూలించాలి. తరచూ పట్టుబడే వన్యప్రాణి వేటగాళ్లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి 
శిక్షించాలి.            
– యన్నం  హనుమంతరెడ్డి, న్యాయవాది, వన్యప్రాణి ప్రేమికులు 

పర్యవేక్షణ కరువై..  
∙ రెగ్యులర్‌ అటవీ ఉద్యోగులు పగలు బేస్‌ క్యాంపులకు వెళుతున్నప్పటికీ రాత్రిళ్లు  ఉండటం లేదన్న విమర్శలున్నాయి. నిరంతరం ఉచ్చుల నివారణ కోసం పెట్రోలింగ్‌ చేయాల్సిన చోట తూతూమంత్రంగా  సాగుతోంది.   
∙ టైగర్‌ హబ్‌గా భావించే బైర్లూటి, నాగలూటి, వెలుగోడు అటవీ క్షేత్రాధికారులు ఎనిమిదేళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారు. దీంతో పర్యవేక్షణాధికారులకు కిందిస్థాయి సిబ్బందికి సమన్వయం లేకపోవడంతో పులి సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి.  
∙ బ్రిటీష్‌ కాలం నాటి సరిహద్దులతో ఎంతో పెద్దదైన విస్తీర్ణంతో ఉన్న అటవీ క్షేత్రాలు (రేంజ్‌లు) ఇంతవరకు పునర్విభజనకు నోచుకోక పోవడంతో సిబ్బంది కొరత ఏర్పడి పులుల సంరక్షణకు పెద్ద అవరోధంగా మారింది. రుద్రకోడు రేంజ్‌ ప్రతిపాదన కొన్నేళ్లుగా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది.

 నిరంతరం నిఘా
ఉచ్చుల బారి నుంచి పులు లు, ఇతర జంతువులను రక్షించేందుకు ప్రతిరోజు ప్ర త్యేక డ్రైవ్‌ చేపడుతున్నాం.   అనుమానిత ప్రదేశాల్లో   అటవీ సిబ్బంది నిశితంగా పరిశీలించి వేటగాళ్లు ఉంచిన ఉచ్చులను తొలగిస్తున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లో తిరిగే అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాం.  
– దత్తాత్రేయ, ఎఫ్‌ఆర్‌వో, వెలుగోడు రేంజ్‌  

మరిన్ని వార్తలు