హనుమంతుని జన్మస్థానం తిరుమలే!

9 Apr, 2021 13:11 IST|Sakshi

ఉగాది రోజున ఆధారాలతో సహా  నిరూపణకు టీటీడీ సమాయత్తం

తిరుపతి ఎడ్యుకేషన్‌: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలే హనుమంతుని జన్మస్థానమని ఈ నెల 13న ఉగాది రోజున ఆధారాలతో సహా నిరూపించేందుకు టీటీడీ సమాయత్తమయ్యింది. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకుగాను గతేడాది డిసెంబర్‌లో పండితులతో టీటీడీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీతో గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించినట్లు కమిటీ సభ్యులు ఈవోకు తెలిపారు.

శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్‌సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీ ప్రకారం నిర్థారించిన అంశాలను కమిటీ సభ్యులు ఈవోకు వివరించారు. ఈవో మాట్లాడుతూ..తిరుమల ఇక నుంచి హనుమంతుని జన్మస్థానంగా కూడా గుర్తింపు పొందనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉగాది పర్వదినం రోజున జ్యోతిష్య శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా ప్రజలకు తెలపాలని కోరారు. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకురావాలని చెప్పారు 

చదవండి: సీఎం గారూ.. రామయ్య పెళ్లికి రండి

మరిన్ని వార్తలు