పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ

8 Aug, 2022 17:23 IST|Sakshi

ఏడు కొండల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజూ పండుగే. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలను విశిష్ట కైంకర్యంగా చేపడతారు. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసన ఆధారం. సోమవారం నుంచి పదో తేదీ వరకు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల చరిత్ర తెలుసుకుందాం.. 


తిరుమల :
శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి దోషాల పరిహారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. 


ఆలయ శాసనాలలో..

తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ  క్రమం తప్పకుండా ఏటా శ్రావణమాసం  శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది.   


శాస్త్రోక్తంగా అంకురార్పణ 

పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామివారి సేనాపతి అయిన విష్వక్సేనుడు పల్లకీపై తిరువీధుల్లో విహరిస్తూ ఆలయ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడే భూమి పూజ, మృత్సంగ్రహణం (పుట్టమన్నును) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు. ఈమేరకు శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డెప్యూటీ ఈఓ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.   
     

తొలిరోజు మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతో తయారు చేసిన పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగిస్తారు.  


మూడోరోజు – ముగింపు

హోమాలు, అభిషేక పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగ మోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు. (చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు)


మూడు రోజులు ఆర్జిత సేవల రద్దు

పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 8న సహస్ర దీపాలంకరణ సేవ, 9న అష్టదళ పాద పద్మారాధన సేవ, 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కల్యోణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.    


రెండో రోజు – సమర్పణ

తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారికి సమ ర్పిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని పరివార దేవతలకు పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. 

మరిన్ని వార్తలు