గణపయ్యకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు

19 Sep, 2021 05:31 IST|Sakshi

కాణిపాకం/యాదమరి(చిత్తూరు)/వేలూరు(తమిళనాడు): చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం సమర్పించారు. ఉదయం తిరుమల నుంచి స్వామివారి పట్టువస్త్రాలను వైవీ సుబ్బారెడ్డి తీసుకురాగా ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, కాణిపాక ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికారు.

స్వామివారి పట్టు వస్త్రాలను గణపయ్య చెంత ఉంచి పూజలు చేశారు. వైవీ దంపతులకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం గణపయ్యకు టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తోన్న స్వర్ణ రథాన్ని వైవీ సుబ్బారెడ్డి, నారాయణ స్వామి, ఎంఎస్‌ బాబు పరిశీలించారు. త్వరలో శ్రీకాళహస్తి, కాణిపాకం ట్రస్ట్‌ బోర్డుల నియామకం చేపడతామని వీరు కాణిపాకంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. 

బంగారు గుడిని సందర్శించిన వైవీ
తమిళనాడులోని వేలూరు జిల్లా శ్రీపురంలోని బంగారు గుడిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠంలోని స్వర్ణలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం పీఠాధిపతి శక్తి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ నవనీత పథకానికి పీఠాధిపతి శక్తి అమ్మ గిర్‌ ఆవుదూడను కానుకగా సమర్పించారు. 

మరిన్ని వార్తలు