సదా శ్రీవారి సేవలో..! 

14 Jul, 2022 03:59 IST|Sakshi

తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 35 విభాగాల ఉద్యోగులు

పూజా కైంకర్యాలకు అర్చకులు, జీయ్యంగార్ల వ్యవస్థ  

భక్తుల క్యూ లైన్‌ నిర్వహణలో విధుల్లో దాదాపు 300 మంది 

ప్రసాదాల తయారీలో 400 సేవకులు

సాక్షాత్‌ శ్రీమహా విష్ణువే వైకుంఠాన్ని వీడి శేషాద్రీశుడై ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరుడుగా కొలువయ్యాడు. సువర్ణ కాంతులు వెదజల్లే బంగారు మేడలో కటాక్షిస్తున్న శ్రీనివాసుడిని దర్శించి..తరించడానికి రోజుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. వారందరికీ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడానికి ఎంతో మంది టీటీడీ ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తుంటారు. కొండ మీదకు చేరుకునే మొదలు శ్రీవారి దర్శనం అయినంతవరకు భక్తులు వీరి సేవలను పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో టీటీడీలో ఎన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా సేవలందిస్తున్నారనే వివరాలతో ‘సాక్షి ’ప్రత్యేక కథనం 

తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కనులారా దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు నిత్యం తిరుమలకు వస్తుంటారు. శ్రీవారి ఆలయంలో ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రోజుకు 80 వేల నుంచి 95 వేల మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభిస్తోంది. ఇంతమంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడానికి శ్రీవారి ఆలయంలో ఉద్యోగులు నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తుంటారు.

స్వామి వారికి వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై అర్ధరాత్రి 2.30 గంటలకు ఏకాంత సేవను నిర్వహించే వరకు ఉద్యోగుల పాత్ర విశేషంగా ఉంటుంది. శ్రీవారి ఆలయ భద్రతను పర్యవేక్షించడానికి నిరంతరాయంగా భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహిస్తుంటారు. శ్రీవారి ఆలయ భద్రతా వ్యవస్థ పర్యవేక్షించడానికి టీటీడీ విజిలెన్స్‌ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్, ఏఆర్, ఏపీఏస్పీ పోలీసులు విధుల్లో ఉంటారు. భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించడానికి ఒక్క శ్రీవారి ఆలయంలోనే 35 విభాగాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు.  

అర్చకులు, జీయ్యంగార్ల వ్యవస్థ ఇలా... 
స్వామి వారి ఆలయంలో వేంకటేశ్వరునికి పూజా కైంకర్యాలు నిర్వహించడానికి గాను అర్చకులు, జీయ్యంగార్ల వ్యవస్థ ఉంటుంది. ప్రధాన అర్చకులు నలుగురు విధుల్లో ఉండగా మరో 45 మంది అర్చకులు వీరికి సహకరిస్తుంటారు. వీరికి సహకారంగా అర్చన పఠించే వ్యక్తి ఒకరు, భాష్యకార్ల సన్నిధి వద్ద ఇద్దరు, పరిచారకులు 19 మంది, తాళ్లపాక వంశస్తులు ఇద్దరు, సన్నిధి గొల్లలు ఇద్దరు, తరిగొండ వెంగమాంబ వంశస్తులు ఒకరు, వేదపారాయణదారులు ఇద్దరు, మరో 26 మంది విధుల్లో ఉంటారు. వీరంతా కూడా స్వామివారి కైంకర్యాల నిర్వహణ కోసం కేటాయించబడిన సిబ్బందే. వీరంతా ప్రతి నిత్యం మూడు షిప్టుల్లో స్వామివారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తుంటారు. స్వామి వారికి నిత్యం నిర్వహించే సేవల కోసం మంగళవాయిద్యకారులు 27 మంది ఉంటారు. స్వామివారి ఉత్సవ మూర్తులు ఊరేగింపు కోసం వాహనబేరర్లు 36 మంది విధుల్లో ఉంటారు.

క్యూ లైన్‌ కోసం..
శ్రీవారి భక్తులు క్యూ లైన్‌ నిర్వహణ కోసం ఆలయానికి డిప్యూటీ ఈవో ఒకరు, ఏవోలు నలుగురు, సూపరింటెండెంట్లు 14 మంది, సీనియర్‌ అసిస్టెంట్‌లు 9 మంది, జూనియర్‌ అసిస్టెంట్‌లు 19 మంది, దఫేదార్లు 6 మంది, షరాఫ్‌లు 10 మంది, అటెండర్లు 59 మంది, తోటమాలీలు 20 మంది, మల్టీపర్పస్‌ ఉద్యోగులు 13 మంది, ప్యాకర్లు 7 మంది, సర్వర్లు ముగ్గురు, ఆరోగ్య సిబ్బంది 5 మంది విధుల్లో ఉంటారు. వీరికి తోడు స్వామి వారి ప్రసాదాల తయారీకి 400 మంది ఉంటారు. ఇలా మొత్తంగా క్యూ లైన్‌ నిర్వహణ కోసం దాదాపుగా 300 మంది విధుల్లో ఉంటే ప్రసాదాల తయారీకి 400 మంది, భధ్రత కోసం 300 మంది సిబ్బంది ఉంటారు.  

మరిన్ని వార్తలు