దేహం సైతం దేశానికే...

29 Apr, 2021 15:03 IST|Sakshi

పోరాట యోధుడు పుణ్యలోకాలకేగాడు.. త్యాగధనుడు స్వర్గసీమకు పయనమయ్యాడు.. మాతృభూమి రుణం తీర్చిన ధన్యుడు అమరపురికి వెళ్లాడు.. దేశసేవే శ్వాసగా జీవించిన చరితార్థుడు భరతమాత ముద్దుబిడ్డగా గుర్తిండిపోతాడు. విశ్రాంత మేజర్‌ జనరల్‌ వేణుగోపాల్‌ అసువులు వాసినా ప్రజల హృదయాల్లో చెరగని చిత్తరువుగా నిలిపోయారు.
విశ్రాంత మేజర్‌ జనరల్‌ వేణుగోపాల్‌కు ఘన నివాళి

అధికార లాంఛనాలతో వీడ్కోలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: మహావీరచక్ర బిరుదాంకితులు రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ వేణుగోపాల్‌కు బుధవారం తిరుపతిలోని ఆయన స్వగృహం వైట్‌హౌజ్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై 12వ ఆర్మీ రెజిమెంట్‌ ఆధ్వర్యంలో గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో అంతిమ వీడ్కోలు పలికారు. మేజర్‌ వేణుగోపాల్‌ భారత సైనిక దళంలో 36 ఏళ్లపాటు విశేష సేవలు అందించారు. సాయుధ దళాల స్వర్ణోత్సవాల్లో భాగంగా గత ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా మేజర్‌ వేణుగోపాల్‌ ఇంటికి వెళ్లి ఆయన చేతుల మీదుగా విజయ జ్వాలను అందుకున్నారు.

దేశసేవకు అంకితం
చిన్నస్వామి, రుక్మిణమ్మ దంపతుల 9 మంది సంతానంలో చిత్తూరు వేణుగోపాల్‌ రెండోవారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఆర్మీలో హవల్దార్‌గా చేఆరు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ డెహ్రాడూన్‌లో సీటు సాధించారు. కఠోర శిక్షణ పొంది గుర్కారైఫిల్‌లో చేరి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు ఎదిగారు. దేశం కోసం ఆయన వైవాహిక జీవితాన్నే త్యాగం చేశారు. పెళ్లి చేసుకుంటే పూర్తి సమయాన్ని విధి నిర్వహణకు కేటాయించలేమని ఆయన బ్రహ్మచారిగానే మిగిలిపోయారు.

బంగ్లాదేశ్‌ విమోచనకు 1971లో జరిగిన ఇండో- పాక్‌ యుద్ధంలో ఆయన బెటాలియన్‌ నాయకుడిగా ప్రధాన భూమిక పోషించారు. 36 ఏళ్ల సైన్యంలో పనిచేసిన వేణుగోపాల్‌ 1984లో పదవీ విరమణ పొందారు. మేజర్‌ జనరల్‌ వేణుగోపాల్‌ 1972లో మహావీర చక్ర, 1980లో పరమ విశిష్ట సేవా మెడల్‌ అందుకున్నారు. వేణుగోపాల్‌ కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని బుధవారం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు.

మరిన్ని వార్తలు