పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ

13 Aug, 2022 03:18 IST|Sakshi

ఎంపీ సుబ్రమణ్యస్వామి టీటీడీ తరపున వాదించవచ్చు

తిరుపతి కోర్టు ఉత్తర్వులు

తిరుపతి లీగల్‌: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాఖలు చేసిన పరువు నష్టం దావాలో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పరువుకు భంగం కలిగేలా, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కథనాలు ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతిపై టీటీడీ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ వ్యాజ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి టీటీడీ తరపున వాదించడానికి గతంలో  కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలంటూ ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్, ఇతర ప్రతివాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస శివరామ్‌ కొట్టివేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రజ్యోతి పత్రిక 2019 డిసెంబర్‌ 1న టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా రెండు కథనాలను ప్రచురించింది. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ, మరో నలుగురిపై టీటీడీ తిరుపతి పదో  అదనపు జిల్లా జడ్జి కోర్టులో గత ఏడాది మార్చిలో పరువు నష్టం దావా దాఖలు చేసింది. ఈ కేసులో టీటీడీ తరపున ఎంపీ సుబ్రమణ్యస్వామి, మరో ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించడానికి టీటీడీ కోర్టు అనుమతి కోరింది. ఇందుకు అనుమతి ఇస్తూ కోర్టు గత ఏడాది మే 1న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్, ఇతర ప్రతివాదులు పిటిషన్‌ను వేశారు. టీటీడీకి న్యాయవాదిని నియమించుకునే శక్తి ఉందని ఆంధ్రజ్యోతి తరపు న్యాయవాది ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి అడ్వొకేట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 32 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వ్యక్తిగత ఆసక్తితో కేసును వాదిస్తున్నారని అన్నారు. కేసు వాదించడానికి కోర్టు ఇచ్చిన అనుమతిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.

ఆయన న్యాయవాది కాదని, కోర్టులో ఎలా వ్యవహరించాలో తెలియదని అన్నారు. దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ తనకు చట్టాలపై అవగాహన ఉందని, ఉచితంగా కేసు వాదిస్తున్నానంటూ వాదనలు వినిపించారు. ఆంధ్రజ్యోతి కథనాలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నందునే ఈ కేసు వాదిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. న్యాయవాది కానివారు కూడా కోర్టులో వాదించడానికి అర్హత ఉందన్నారు. సుబ్రమణ్యస్వామి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆంధ్రజ్యోతి పిటిషన్‌ను కొట్టివేసింది.  

మరిన్ని వార్తలు