ఆవేశాలు రుణపాశాలు తెంచేవేళలో..

23 Nov, 2022 15:13 IST|Sakshi
కోడలు తాళం వేసిన ఇల్లు

ఆస్తి పంపకాల్లో తేడాలని గొడవ

అత్తమామలను గెంటేసిన కోడలు..

రాత్రి వేళ ఇంటికి తాళం

బిక్కుబిక్కుంటూ బంధువులఇంట్లో ఆశ్రయం

పోలీసుస్టేషన్‌కు చేరిన పంచాయితీ

తల్లి.. తండ్రి.. ఈ లోకంలో కనిపించే ప్రత్యక్ష దైవాలు. నవమాసాలు మోసి, ప్రాణం పోయే నొప్పులను పంటి బిగువన భరించి జన్మనిచ్చేది తల్లి అయితే.. బిడ్డ ముసిముసి నవ్వులకు మురిసిపోతూ.. బుడి బుడి అడుగుల్లో సంతోషం వెతుక్కుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకునేది తండ్రి. రక్తం పంచిన వీరిద్దరినీ మించిన బంధం మరొకటి ఉండదు..కష్ట మొచ్చినా, నష్టమొచ్చినా కడుపులో దాచుకొనే నేస్తాలూ ఈ ఇద్దరే. అమ్మ లేనిదే ముద్ద దిగదు.. నాన్న లేనిదే కాలం గడవదు.. పిల్లలకు వీళ్లే రెండు కళ్లు. తాము తినకపోయినా పిల్లల కడుపు నిండితే చాలనుకునే తల్లిదండ్రులు.. కాస్త వయస్సు పైబడితే చాలు, అదే పిల్లలకు చేదవుతున్నారు. తమ బతుకు వారి రక్తమాంసాలనే విషయం మరిచి.. చచ్చినప్పుడు వెంట రాని డబ్బు కోసం కాటికి కాలు చాచిన ఎండు కట్టెలను వీధిన పడేస్తున్న ఘటన కడు దయనీయం. 

పుట్టినప్పుడు.. పెరుగుతున్నప్పడు.. అమ్మానాన్నలపై ఎనలేని ప్రేమ. పెరిగే కొద్దీ, ఓ తోడు ఇంటికి చేరగానే ఆ బంధం క్రమంగా బరువవుతోంది. ఈ రోజు వాళ్లు.. రేపు మనం అనే విషయాన్ని మరిచి, కళ్లను కమ్మేసిన కరెన్సీ పొరలు మానవ సంబంధాలను కనుమరుగు చేస్తున్నాయి. మట్టినే నమ్ముకున్న ఓ రైతు, రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఓ ఇంటి వాళ్లను చేసి ఉన్నంతలో పంచిపెట్టాడు. ఇక్కడే.. అన్నదమ్ములు, తోడి కోడళ్ల మధ్య అగ్గి రాజుకుంది. ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకొని.. చివరకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇంట్లోకి రావద్దంటూ గెంటేయడం మానవత్వానికి మాయని మచ్చగా నిలుస్తోంది. 


చంద్రగిరి:
మండల పరిధిలోని కొటాల గ్రామానికి చెందిన చెంగల్‌రామ నాయుడు(86), నాగభూషణమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు యోగానంద తిరుపతిలోని ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపనీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా.. చిన్న కుమారుడు దేవరాజులు టీటీడీకి చెందిన సాంస్కృతిక విభాగంలో నెల్లూరులో పనిచేస్తున్నారు. ఇటీవల కొటాల గ్రామంలోని సర్వే నంబర్‌ 445లోని చెంగల్‌రామ నాయుడుకు చెందిన వ్యవసాయ భూమిలో 54 సెంట్లను యోగానందకు, 15 సెంట్లను దేవరాజులకు రిజిస్ట్రేషన్‌ చేయించాడు. అయితే 20 ఏళ్ల క్రితం చెంగల్‌రామ నాయుడు నిర్మించిన ఇంట్లో భార్యతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యోగనంద పాత ఇంటిని మరింత సౌకర్యవంతంగా కట్టుకోవడానికి బ్యాంకు లోను అవసరమని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నాగభూషణమ్మ, తమ్ముడు దేవరాజు సంతకాలు లేకుండా వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.  

పంపకాల్లో అన్యాయమని.. 
సోమవారం రాత్రి యోగానంద ఇంట్లో ఉండగా అతని భార్య విశ్వేశ్వరి(వేద) వృద్ధులు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారంటూ గొడవకు దిగింది. మేము కోరిన మేరకు ఆస్తి పంపకాలు చేయలేదని, అడిగిన మేరకు రాసివ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడింది. వృద్ధాప్యం కారణంగా తాను ఎక్కడికీ రాలేనని, నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిల్లో ఉన్నామని కోడలితో కన్నీరు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి పరిష్కరించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా తిట్ల దండకం అందుకుంది. అంతటిలో ఆగకుండా తీవ్ర ఆగ్రహంతో ఇల్లు తన భర్త యోగానంద పేరిట ఉందంటూ వృద్ధులను బయటకు గెంటేసి తాళం వేసింది. 

బంధువుల ఇంట్లో ఆశ్రయం 
కోడలు ఇంట్లో నుంచి గెంటేయడంతో రాత్రి వేళ వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. నడవలేని స్థితిలోని భార్యతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ పెద్దలు కోడలికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవడంతో చివరకు బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎంతో గుట్టుగా సంసారం నెట్టుకొచ్చినా, ఇద్దరు కొడుకులు ఉండి మరో ఇంట్లో ఉండాల్సి రావడంతో ఆ దంపతులు కుమిలిపోయారు.

విధిలేక పోలీసుస్టేషన్‌కు.. 
ఆ రాత్రి కన్నీళ్లతో గడిచిపోయింది. ఇక బంధువులకు భారం కాలేక, న్యాయం జరుగుతుందనే ఆశతో అతి కష్టం మీద పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. కొడుకు, కోడలికి సర్దిచెప్పి న్యాయం చేయాలని చంద్రగిరి ఎస్‌ఐ వంశీధర్‌ను వేడుకున్నారు. కనీసం పోలీసుస్టేషన్‌ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధుల వద్దకే వెళ్లి ఎస్‌ఐ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


ఎట్టకేలకు ఓ చిన్న గది 

ఒక రాత్రి బంధువుల ఇంట్లో తల దాచుకొని, మరుసటి రోజు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన వృద్ధ దంపతులకు కాస్త ఊరట కల్పించేందుకు గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. యోగానంద, అతని భార్య విశ్వేశ్వరితో చర్చించి, గట్టిగానే హెచ్చరించారు. కుమారుడి స్వాధీనంలోని ఇంట్లోనే వృథాగా ఉన్న ఓ గదిలో వృద్ధ దంపతులు ఉండేందుకు అతి కష్టం మీద ఒప్పించారు. కనీస సౌకర్యాలు లేని ఆ గదిని చూసి నాగభూషణమ్మ ఈ వయస్సులో తమకు ఇదేమి ఖర్మ అంటూ కన్నీరుమున్నీరైంది.

అల్లారు ముద్దుగా పెంచినా.. 
ఇద్దరూ కొడుకులే కావడంతో జీవిత చరమాంకంలో ఎలాంటి లోటు ఉండదనుకున్నాం. ఈ వయస్సులో ఆస్తి పంపకాల వద్ద పెద్ద కొడుకు, కోడలు చేస్తున్న అరాచకం కన్నీరు పెట్టిస్తోంది. నా భార్యకు ఇటీవల ఆపరేషన్‌ జరగడంతో కనీసం కూర్చోలేని పరిస్థితి. కష్టపడి ఇల్లు కట్టి, కొడుక్కు ఉద్యోగం తీయిస్తే నిలువ నీడ లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఈ వయస్సులో మాకు ఇంకేమీ వద్దు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే చాలు. 
– చెంగల్‌రామ నాయుడు 

మమ్మల్ని మోసం చేశారు 
2006లో మా మామ చెంగల్‌రామ నాయుడు ఆస్తి భాగపరిష్కారంలో నన్ను, నా భర్తను మోసం చేసి మా మరిదికి అనుకూలంగా వ్యవహరించారు. మెయిన్‌ రోడ్డులోని పొలం కాకుండా మాకు లోపలి భాగం ఇచ్చారు. అడిగితే అదేం లేదని, మీకు మెయిన్‌ రోడ్డులోనే ఉంటుందని చెప్పడంతో అప్పట్లో సంతకాలు చేశాం. ఇప్పుడు మా మరిది ఆ స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయమై అత్తమామలను సోమవారం రాత్రి ప్రశ్నిస్తే పత్రాలు ఎలా ఉంటే అలా చేసుకోండని అంటున్నారు. 2003లో అత్తమామలు ఉంటున్న ఇంటిని మాకు రిజిస్ట్రేషన్‌ చేయించారు. అందుకే మా ఇంటికి మాకు ఇమ్మంటున్నా. 
– విశ్వేశ్వరి, యోగానంద భార్య, కొటాల

మరిన్ని వార్తలు