-

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత 

17 Sep, 2020 04:39 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌తో బల్లి దుర్గాప్రసాదరావు (ఫైల్‌)

గుండెపోటుతో చెన్నై అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస 

సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, నెట్‌వర్క్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు (63) బుధవారం సాయంత్రం  చెన్నైలో కన్నుమూసారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో చికిత్స కోసం మూడు వారాల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగిటివ్‌ నిర్ధారణ అయిందని, అయితే రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా సెప్టిసీమియా అనే వ్యాధి బారినపడ్డారని అపోలో ఆస్పత్రి సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, బర్డ్‌ (తిరుపతి) డైరెక్టర్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

ఐసీయూలో ఉంచి చికిత్స చేశారని, ఈ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని చెప్పారు. దుర్గాప్రసాదరావు ఆస్పత్రిలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అపోలో వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితులు, మెరుగైన వైద్య విషయంలో నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. కాగా, దుర్గాప్రసాదరావు అంత్యక్రియలు గురువారం ఆయన స్వస్థలం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరగనున్నాయి.   

నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా..  
దుర్గాప్రసాదరావుకు భార్య సరళమ్మ, కుమారులు కళ్యాణ్, కార్తీక్, కుమార్తె హరిత ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో తొలిసారిగా గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గూడూరు నుంచే మొత్తం నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఓ పర్యాయం మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్‌సీపీలో చేరి 2,28,376 ఓట్ల భారీ మెజార్టీతో తిరుపతి ఎంపీగా గెలుపొందారు.  

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌ సంతాపం 
దుర్గాప్రసాదరావు మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పనిచేశారని, ఆయన కుంటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెలుపుతున్నానని ట్వీట్‌ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ.. ‘దుర్గాప్రసాదరావు ఏపీ ప్రగతికి చాలా కృషి చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు.  

ఎంపీలు, మంత్రులు, ప్రముఖుల సంతాపం 
ఎంపీ దుర్గాప్రసాదరావు మృతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ, కళత్తూరు నారాయణస్వామి సంతాపం తెలిపారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి చైర్మన్‌ టీఎస్‌ విజయ్‌ చందర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. దుర్గాప్రసాదరావు కుటుంబ సభ్యులకు ట్విట్టర్‌లో సానుభూతి తెలిపారు. 

నేడు సంతాపసభలు 
ఎంపీ మృతికి సంతాపం తెలిపేందుకు గురువారం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో, ఉదయం 11.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణవార్త తెలిసిన వెంటనే దుర్గాప్రసాదరావు కుమారుడు కళ్యాణ్‌కి సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేసి ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘‘దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. 4 దశాబ్దాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో అవిరళ కృషి చేశారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నాను’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు