Ruia Hospital: రుయాలో అడుగడుగునా నిర్లక్ష్యం

7 May, 2022 10:54 IST|Sakshi
గురువారం అర్ధరాత్రి రికార్డులు తనిఖీ చేస్తున్న ఎస్‌డీఎస్‌ సభ్యులు

ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప రుయా ఆస్పత్రి అధికారుల తీరు మారడంలేదు. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు మెరుగైన చికిత్స కరువైంది. ఉన్నతాధికారులు పరిశీలన చేసి మందలించినా ప్రయోజనం లేదు.

తిరుపతి తుడా: రాయలసీమ పెద్దాస్పత్రిగా తిరుపతి రుయా పేరుపొందింది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్, వైద్య పరికరాల కోసం నాడు–నేడు ద్వారా రూ.450 కోట్లు కేటాయించింది. వైద్యుల పదోన్నతులు, బదిలీలను చేపట్టింది. వైద్యాధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఇటీవల రుయా ఆస్పత్రిలో అంబులెన్స్‌ యజమానుల తీరు పై ఓ అ«ధికారిని సస్పెండ్‌ చేశారు. మరో ఉన్నతాధికారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఆస్పత్రిలో పర్యటించి లోటుపాట్లపై కన్నెర్ర చేశారు. అత్యవసర విభాగం నిర్వహణ లోపంపై మండిపడ్డారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినా అధికారుల తీరు మారలేదు. రుయా ఆస్పత్రి వర్కింగ్‌ కమిటీ సభ్యుడు బండ్ల చంద్రశేఖర్‌ రాయల్‌ గురువారం అర్ధరాత్రి ఆస్పత్రిలో పర్యటించారు. నైట్‌ డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేకపోవడంపై ఆరా తీశారు. వార్డుల్లో రోగు లను ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు స్ట్రెక్చర్లపై తీసుకెళ్లడంలోను నిర్లక్ష్యాన్ని గుర్తించారు. సహాయకులే రోగులను మరో వార్డుకు, వైద్య పరీక్షలకు తీసుకెళుతుండడం ఆగ్రహం వ్యక్తం చేశా రు.   
ఆస్పత్రి పర్యవేక్షణాధికారి నిర్వాకంవల్లే..  
ఆస్పత్రి పర్యవేక్షనాధికారి ఎవరి అధికారాలను వారికి ఇవ్వకుండా తనవద్దే ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలు నెలకొంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులకు డ్యూటీలు కేటాయించడం, వైద్య సిబ్బందితో విధులు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని రుయాలో పాలనను గాడినపెట్టి రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

చదవండి: ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు

మరిన్ని వార్తలు