రూ.68 లక్షల విలువైన మద్యం ధ్వంసం

29 Jun, 2022 05:08 IST|Sakshi
మద్యం బాటిళ్లను ధ్వంసం చేయిస్తున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి

రేణిగుంట: మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం చిన్న చెరువు వద్ద మంగళవారం గతంలో పట్టుబడిన మద్యం నిల్వలను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమంగా తీసుకెళుతున్న మద్యం, బెల్ట్‌ షాపుల్లో సీజ్‌ చేసిన మద్యం, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో నేతృత్వంలో నూతన జిల్లా ఏర్పడినప్పటి నుంచి పట్టుకున్న మద్యం నిల్వలను అనంతపురం డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు.

మొత్తం 32,341 మద్యం బాటిళ్లులోని 6,800 లీటర్ల మద్యం నిల్వలను ఇక్కడకు తీసుకొచ్చి ధ్వంసం చేశారు. అదనపు ఎస్పీ సుప్రజ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ స్వాతి సమక్షంలో బాటిళ్లను ధ్వంసం చేశారు. ఇటీవల యువత అక్రమ సంపాదన కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై రానున్న రోజుల్లో పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమ మద్యం తరలిస్తున్నా, బెల్ట్‌షాపులు నడుపుతున్నా, నాటు సారా కాస్తున్నా డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందివ్వాలని కోరారు.  

మరిన్ని వార్తలు