Tirupati: చల్లంగ చూడు... గంగమ్మ తల్లీ 

25 May, 2022 13:00 IST|Sakshi

తిరుపతి కల్చరల్‌: చల్లంగ చూడు... గంగమ్మ తల్లీ అంటూ భక్తులు మంగళవారం తాతయ్యగుంట గంగమ్మకు మరు పొంగళ్లు పెట్టి, మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి గంగజాతర తర్వాత ఐదు మంగళవారాలు గంగమ్మకు మరుపొంగళ్లు పెట్టి, మొక్కులు తీర్చుకోవడం భక్తుల ఆనవాయితీ. ఇందులో భాగంగా గంగజాతర తర్వాత వచ్చిన తొలి మంగళవారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసి, పొంగళ్లు పెట్టి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.  

ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీతో తాతయ్యగుంట గంగమ్మ ఆలయం కిక్కిరిసింది. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. అనంతరం మొక్క జొన్న కంకులు, వివిధ పుష్పాలతో అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. జాతరలో వేషాల మొక్కులు చెల్లించని భక్తులు చిన్నా పెద్దా తేడా లేకుండా మంగళవారం వేషాలు వేసి, భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. మరి కొందరు భక్తులు వేయికళ్ల దుత్తలు నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణ చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు.  ఆలయ పాలక మండలి చైర్మన్‌ కట్టా గోపియాదవ్, ఈఓ  మునికృష్ణయ్య దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు.  

మరిన్ని వార్తలు