పీఎస్‌ఎల్‌వీ–సీ51 ప్రయోగంలో తిరుపతి విద్యార్థులు

1 Mar, 2021 03:48 IST|Sakshi
సతీష్‌ ధావన్‌ శాట్‌ ఉపగ్రహం తయారీలో పాల్గొన్న యువ శాస్త్రవేత్తలు

సతీష్‌ ధావన్‌ శాట్‌ రూపకల్పనలో యజ్ఞసాయి, రఘుపతి

యూనివర్సిటీ క్యాంపస్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ–సీ51 ఉపగ్రహ ప్రయోగంలో తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు యజ్ఞసాయి, రఘుపతి భాగస్వాములయ్యారు. మరో ఐదుగురితో కలిసి వారిద్దరూ రూపొందించిన సతీష్‌ ధావన్‌ శాట్‌.. పీఎస్‌ఎల్‌వీ–సీ51 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 1.9 కిలోల బరువున్న శాట్‌ కోసం వీరు దాదాపు 4 నెలలపాటు శ్రమించారు. ఏరోస్పేస్‌లో ఇంజనీరింగ్‌ చేసిన యజ్ఞసాయికి ఇది మూడో ఉపగ్రహం కాగా రఘుపతికి తొలి ఉపగ్రహం.

తిరుపతికి చెందిన కంబాల రాము, వాణిల కుమారుడు కె.యజ్ఞసాయి తన విద్యాభ్యాసమంతా తిరుపతిలోనే పూర్తి చేశాడు. చెన్నైలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. ఈ సమయంలో స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ నాసాకు వెళ్లే అవకాశం కల్పించింది. దీంతో తన డిగ్రీని ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌కు మార్చుకున్నాడు. కలాం శాట్, కలాం శాట్‌ వీ2 ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్నాడు. తిరుపతికి చెందిన ఫళణి(హమాలీ), మంజుల కుమారుడైన రఘుపతి ఎంటెక్‌ చేశాడు.   

అవకాశం ఇలా..
అంతరిక్షం పట్ల ఆసక్తి కలిగినవారికి చెన్నైకి చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ శిక్షణ ఇస్తుంది. ఆ సంస్థ సీఈవో శ్రీమతి కేశన్‌ ప్రోత్సాహంతో విద్యార్థులు  శిక్షణ పొందుతున్నారు. తాజాగా పంపిన సతీష్‌ ధావన్‌ శాట్‌ భూమికి 530 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో తిరుగుతుంది. తక్కువ శక్తితో ఎక్కువ డేటాను సమర్థవంతంగా ఉపయోగించే పరిశోధనలు చేస్తుంది.  
సతీష్‌ ధావన్‌ శాట్‌ ఉపగ్రహం 

మరిన్ని వార్తలు