Police Rude Behavior: పోలీసులపై కోపం.. టౌన్‌ మొత్తం కరెంట్‌కట్‌ చేసిన ట్రాన్స్‌కో సిబ్బంది

21 May, 2022 11:26 IST|Sakshi

సాక్షి,పలమనేరు(తిరుపతి): ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు అవమానించారని ఆగ్రహించిన ట్రాన్స్‌కో సిబ్బంది పట్టణం మొత్తానికి విద్యుత్‌ సరఫరా నిలిపేయడం శుక్రవారం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ఇటీవల పట్టణంలో జరిగిన గంగజాతరలో స్థానిక ముత్తాచారిపాళ్యానికి చెందిన రజని(58) కరెంట్‌ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా స్థానిక లైన్‌మన్‌ ప్రకాష్,  సచివాలయ పరిధిలో సిబ్బందిని శుక్రవారం స్థానిక స్టేషన్‌కు పిలిపించారు.

వారు వెళ్లగానే వారి సెల్‌ఫోన్లను తీసిపెట్టుకుని అక్కడే వేచిఉండమని చెప్పారు. దీంతో వారు తమకి, కేసుకు ఏంటి సంబంధంమంటూ అడిగినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కాస్త దురుసుగా మాట్లాడడంతో, వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తమను అవమానించారని భావించిన ట్రాన్స్‌కో సిబ్బంది పట్టణంలో కరెంట్‌ సరఫరాను నిలిపేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆపై ట్రాన్స్‌కో ఏడీ చిన్నబ్బ, డీఎస్పీ గంగయ్య చర్చించి, ఈ విషయం పెద్దది కాకుండా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిసింది. 

ఈవిషయమై ట్రాన్స్‌కో ఏడీ చిన్నబ్బను ‘సాక్షి’ వివరణ కోరగా తమ సిబ్బందిపట్ల పోలీసుల తీరు బాగోలేకనే వారు కరెంటు ఆఫ్‌ చేసినట్టు తెలిసిందన్నారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్‌ స్పందిస్తూ.. విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి నేపథ్యంలో విచారణ నిమిత్తం ట్రాన్స్‌కో సిబ్బందిని పిలిపించిన మాట వాస్తవమేనన్నారు. అయితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కాసేపు స్టేషన్‌లోనే కూర్చోబెట్టుకున్నామన్నారు. దీన్ని అవమానంగా భావించి పట్టణం మొత్తానికి విద్యుత్‌ సరఫరా నిలిపేయడం ఎంత వరకు సమంజసమన్నారు.

చదవండి: Indian Paper Currency History: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్‌లో నోట్ల ముద్రణ

మరిన్ని వార్తలు