అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ

1 Mar, 2021 14:01 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో  చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్‌ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. నిరసన తెలిపేందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్‌లోని ఫ్లోర్‌పైనే బైటాయించి నానా హంగామా సృష్టించారు. 

ఈ మేరకు ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.

చదవండి: 

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా

బాబుకు చిత్తూరు జిల్లాలో మనుగడ లేదు: పెద్దిరెడ్డి

>
మరిన్ని వార్తలు