Tirupati Water Tank Incident: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం

26 Nov, 2021 15:35 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లి లోని శ్రీకృష్ణా నగర్‌లో గురువారం సాయంత్రం వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ని శుభ్రం చేస్తుండగా అది భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చింది. దీంతో ఆ వాటర్‌ ట్యాంక్‌లో ఉన్న మహిళ కేకలు వేయగా.. ఆమె భర్త నిచ్చెన సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చాడు. కాగా ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. 18 సిమెంట్ ఒరలతో ఆ వాటర్‌ ట్యాంక్‌ని భూమిలోపల నిర్మించినట్టు స్థానికులు చెప్తున్నారు.

భూమిపై నుంచి పైకి వచ్చి నిటారుగా నిలిచి ఉన్న వాటర్ ట్యాంక్‌ను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా శ్రీకృష్ణానగర్‌లోని ఘటనను ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్స్ బృందం పరిశీలించింది. అనంతరం దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఇవన్నీ కలగలపిన అంశాల కారణంగానే సంపు 15అడుగులు పైకి లేచిందని తెలిపారు. అయితే దీని వల్ల భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని చెప్పారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: దారుణం: భర్త రాక్షసత్వానికి ఇటీవల అబార్షన్‌.. ఇప్పుడు చీర కొనుక్కుందని ఏకంగా..

మరిన్ని వార్తలు