టెన్త్‌ పరీక్ష ఫీజు 125 రూపాయలే

10 Dec, 2022 09:02 IST|Sakshi

సాక్షి, కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నెల క్రితమే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల10లోగా చెల్లించవచ్చు. అన్ని సబ్జెక్టులకు కలిపి కేవలం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరీక్ష ఫీజు పెంచలేదు. ఇదే మొత్తాన్ని వసూలు చేస్తోంది.  

అపరాధ రుసుంతో... 
రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 20 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్‌ 25 వరకూ అపరాధ రుసుం రూ.200తో , ఆ తర్వాత అంటే డిసెంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 30లోగా రూ.500 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారు రూ.125తో పాటు ప్రాక్టికల్స్‌ కోసం అదనంగా మరో రూ.60 చెల్లించాలి. గతంలో టెన్త్‌ ఫెయిలైన విద్యార్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులుంటే రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. 

హెచ్‌ఎంలదే కీలక బాధ్యత.. 
10వ తరగతి పరీక్షల ఫీజు విషయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత ఉంటుంది. విద్యార్థుల పరీక్ష ఫీజుకు సంబంధించిన నామినల్‌ రోల్స్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే విద్యార్థులు నష్టపోతారు. పూర్తి చేసిన నామినల్‌ రోల్స్‌కు పాఠశాల లాగిన్‌లోని లింక్‌ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చలానా లేదా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఫీజు చెల్లిస్తే ఉపయోగం ఉండదు. 10 పరీక్షలకు సంబంధించిన మ్యానివల్‌ నామినల్‌ రోల్స్‌ (ఎంఎన్‌ఆర్‌)ను డిసెంబర్‌ 21 నుండి 31 లోగా డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 

23,758 మంది రెగ్యులర్‌ విద్యార్థులు.. 
జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 11,782 మంది, మున్సిపల్‌ స్కూల్స్‌లో 1,803, కస్తూర్బా స్కూల్స్‌లో 1,115 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 783 మంది, సోషల్‌ వేల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 540 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్‌లో 220 మంది ఉన్నారు. అలాగే ఏపీఆర్‌ఈఐ సొసైటీ స్కూల్స్‌లో 88 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ స్కూల్స్‌లో 35 మంది, మోడల్‌ స్కూల్స్‌లో 796 మంది, నవోదయ విద్యాలయాల్లో 83 మంది, ప్రైవేటు/కార్పొరేట్‌ స్కూల్స్‌లో 5,603 మంది, సీబీఎస్‌సీ వారు 178 మంది, బీసీ వెల్ఫేర్‌ స్కూల్స్‌లో 724 మందితో పాటు గవర్నమెంట్‌ స్కూల్స్‌లో మరో 8 మంది అంధ విద్యార్థులతో కలిపి బాలురు 12,450 మంది, బాలికలు 11,308 మంది మొత్తం 23,758 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఈసారి పది పరీక్షకు హాజరు కానున్నారు. 

ఈసారి ఆరు పేపర్లే.. 
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది. పది పబ్లిక్‌ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్‌ కారణంగా గత ఏడాది పది పబ్లిక్‌ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20 అలాగే 2020–21 విద్యాసంవత్సరాల్లో 10 పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని టెన్త్‌ పాస్‌ చేసిన విషయం తెలిసిందే. ఈసారి సీబీఎస్‌ఈ తరహాలోనే టెన్త్‌లో ఆరు పేపర్లే ఉంటాయి. 

ప్రైవేటు స్కూళ్లలో ఫీ‘జులుం’.. 
10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. స్కూల్‌ఫీజు, ట్యూషన్‌ ఫీజు, ట్రాన్స్‌పోర్టు ఫీజు ఇలా బకాయి ఉన్న ఫీజులన్నీ చెల్లిస్తే గానీ పరీక్ష ఫీజు తీసుకునేది లేదని మెలిక పెడుతున్నారు.

ఇంకొన్ని చోట్ల కోవిడ్‌ సమయంలోని పెండింగ్‌లో ఉన్న ఫీజులు కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫలానా తేదీకి ఫీజు మొత్తం క్లియర్‌ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులతో హామీ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్టుకు కలిపి ప్రభుత్వం కేవలం 125 మాత్రమే నిర్దేశించింది. కానీ చాలా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో రూ.500 నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. 

అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు 
10వ తరగతి పరీక్ష ఫీజు కన్నా అధిక మొత్తంలో వసూలు చేసిన పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం. అలాగే పరీక్ష ఫీజుకు పాఠశాల ఫీజులకు మెలిక పెడితే శాఖాపరమైన చర్యలు తప్పవు. నామినల్‌ రోల్స్‌ విషయంలో అజాగ్రత్త వహిస్తే సంబంధిత హెచ్‌ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  
– మీనాక్షి, డీఈఓ   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు