అందమైన మనసులో ఇంత అలజడెందుకో

10 Oct, 2023 05:52 IST|Sakshi

నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ఈ ఏడాది ప్రచారం

యాంత్రిక జీవనంలో పెరుగుతున్న మానసిక సమస్యలు

సహచరుల కంటే ఫోన్లు, కంప్యూటర్లతోనే కాలం గడుపుతున్న జనం

సమాజంలో స్వకీయంగా గడిపే వారి సంఖ్యే ఎక్కువ

మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలంటున్న నిపుణులు

సంతృప్తికర జీవనం సాగించాలంటున్న వైద్యులు

లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనిషి యంత్రంలా మారాడు. నిద్ర లేచింది మొదలు ఉరు­కులు.. పరుగుల జీవితానికి అలవాటు పడ్డా­డు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకా సెల్‌ఫోన్లు, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నా­డు. నలుగురు కలిసి కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు.

భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నా చెరో వైపు కూర్చుని ఫోన్లు, లాప్‌టాప్‌లతో కాలక్షేపం చేస్తు­న్నారు. మరోవైపు ఆశ, అత్యాశ పెరిగి­పో­యి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పో­యింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజ­ల్లో విపరీతంగా మానసిక సమస్యలు పెరిగి­పోయాయి. ఒత్తిళ్లు, డిప్రెషన్‌ అధికమ­య్యా­­యి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ ఏడాది ప్రపంచ మా­నసిక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరో­గ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రకటించింది. 

మానసిక ఆరోగ్యంపై దృష్టి ఏదీ
ఆర్థిక ఇబ్బందులతో కొందరు తీవ్ర ఒత్తిళ్లు ఎదు­ర్కొంటుండగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దే­శంతో విశ్రాంతి లేని జీవనం సాగిస్తూ అనేక­మంది మానసిక రుగ్మతల బారిన పడుతు­న్నారు. ఆశ, అత్యాశలు బాగా పెరిగిపోయా­యి. మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. పిల్లల ఆకాంక్షలు తెలుసుకోకుండా డాక్టర్‌ కావాలి, ఐఏఎస్‌ కావాలని రూ.లక్ష­లు ఖర్చుచేసి ఆ కోర్సుల్లో చేర్చుతుంటే.. అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వారంతా శారీరక అనారోగ్యా­లకు తక్షణమే చికిత్స పొందుతున్నారు కానీ.. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఆలోచనే చేయడం లేదు. 

ఆత్మీయ, అనురాగాలేవి
ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సమూ­హాలుగా ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడు­కునే వారు. ఉమ్మడి కుటుంబాల్లో సాయంత్ర­ ం వేళ ఇంట్లోని వారంతా కలిసి కబుర్లు చెప్పుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నుంచి నిద్రించే వరకూ స్మార్ట్‌ ఫోన్‌ లేనిదే నిమిషం గడవడం లేదు. ఏదైనా ­సమాచారం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా చాటింగ్‌లోనే. కనీసం కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బంధువులు, ఆత్మీయుల కలయి­కలు కూడా చాలా తక్కువ­గానే ఉంటున్నాయి. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు ఒకప్పుడు రెండు మూడు రోజుల ముందే వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కల్యాణ మండపం వద్దకు రావ­డం.. కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం జరుగు­తోంది. ఇలా ఆత్మీయ , అనుబంధాలు అంతరించి­పో­వడం కూడా మా­నí­Üక ఆరోగ్యంపై ప్రభా­వం చూపుతోంది.

మానసిక ప్రశాంతతోనే ఆరోగ్యం
ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకా­శం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్త­పోటు, మధు­మే­హం అదు­పు­లో ఉం­డదని నిపు­ణు­లు చెబు­తు­న్నా­­రు. అంతేకా­కుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ప­న్న­మవుతాయని.. ఫలితంగా గుండెపో­టు, మెదడు పోటుకు దారి తీయవ­చ్చు­నంటు­న్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉ­న్న­ప్పుడే మనిషి సంపూర్ణ ఆరో­గ్యంగా జీ­వించగలుగుతాడని వైద్యులు అంటున్నారు. 

పాజిటివ్‌గా ముందుకు సాగాలి
ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలి. సెల్‌ఫోన్లు, టెక్నాలజీని అవసరం మేరకే వాడాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపటం ద్వారా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి.
– డాక్టర్‌ వి.రాధికారెడ్డి, మానసిక వైద్యురాలు, రిజిస్ట్రార్, వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ

మరిన్ని వార్తలు