గ్రామాల్లో టాయిలెట్‌ వేస్ట్‌ శుద్ధి కేంద్రాలు

14 Feb, 2022 05:35 IST|Sakshi

తొలి దశలో 23 గ్రామాల్లో ఏర్పాటు

పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కార్యాచరణ

ఒక్కొక్క గ్రామంలో కనీసం అర ఎకరా స్థలంలో నిర్మాణం

శుద్ధి అనంతరం సేంద్రియ ఎరువుగా మార్చేందుకు చర్యలు  

సాక్షి, అమరావతి: సెప్టిక్‌ ట్యాంకులు నిండి ఇబ్బందిపడుతున్న గ్రామాల్లో.. టాయిలెట్‌ వేస్ట్‌ శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. సెప్టిక్‌ ట్యాంకుల నుంచి శుద్ధి కేంద్రాలకు టాయిలెట్‌ వేస్ట్‌ను తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. సబ్సిడీ కమ్‌ లోన్‌ విధానంలో నిరుద్యోగ యువతకు ఈ వాహనాలను అందజేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే రోజూ 5,940 కిలోలీటర్ల టాయిలెట్‌ వేస్ట్‌.. సెప్టిక్‌ ట్యాంకులకు చేరుతుంది. కానీ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో కేవలం రోజుకు 1,145 కిలోలీటర్ల టాయిలెట్‌ వేస్ట్‌ను శుద్ధి చేసే కేంద్రాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో టాయిలెట్‌ వేస్ట్‌ను శుద్ధి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్‌కి ఒకటి చొప్పున గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన టాయిలెట్‌ వేస్ట్‌ను.. సేంద్రియ ఎరువుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు.  

తొలిదశలో 23 గ్రామాల్లో.. 
రాష్ట్రవ్యాప్తంగా 46 గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 23 గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కొక్క చోట కనీసం అర ఎకరా స్థలంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క శుద్ధి కేంద్రం నిర్మాణం కోసం గరిష్టంగా రూ.1.80 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మిగిలిన గ్రామాల్లో రెండో దశలో చేపడతారు. 

మరిన్ని వార్తలు