ద్వారకాతిరుమల కొండపై టోల్‌ మాయాజాలం!

22 Sep, 2022 09:17 IST|Sakshi

ద్వారకాతిరుమల: చినవెంకన్న కొండపైకి వెళ్లే దేవస్థానం టోల్‌ గేట్‌ రుసుం కాంట్రాక్టర్‌ అవసరాలకు అనుగుణంగా మారిపోతోంది. దాంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న అధిక ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఈ మార్పు వెనుక అసలు నిజాలు తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ద్వారకాతిరుమల క్షేత్రంలో టోల్‌ రుసుం వసూల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. భక్తుల వాహనాల నుంచి టోల్‌ రుసుం వసూలు చేసుకునే హక్కుకు దేవస్థానం 2020 జనవరి 27న బహిరంగ వేలంపాట, సీల్డ్‌ టెండర్‌ నిర్వహించింది. బహిరంగ వేలంలో 9 మంది టెండర్‌దారులు పాల్గొనగా, సీల్డ్‌ టెండర్‌ ద్వారా వచ్చిన రూ. 1,30,56,777ల హెచ్చుపాటను అధికారులు ఆమోదించారు. 

అసలు షరతులు ఇవీ..  
టెండర్‌ షరతుల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్‌ లారీ, బస్సు, ఇతర భారీ వాహనాలకు రూ.150, మినీ బస్సు, 407 వ్యాన్‌ స్వరాజ్, మజ్దూర్‌కు రూ.100, ట్రాక్టరు ట్రక్కుతో రూ. 50, ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్‌కు రూ.50, ట్రాక్టరు ఇంజనుకు రూ.50, కారు, జీపు, వ్యాన్‌కు రూ.30, స్కూటర్, మోటారు సైకిల్‌కు రూ.10, పాసింజర్‌ ఆటోకు రూ.10 వసూలు చేసుకోవాల్సి ఉంది.

సదరు కాంట్రాక్టర్‌ కోవిడ్‌ పరిస్థితుల నేపధ్యంలో టోల్‌గేట్‌ నిర్వహణను వెంటనే చేపట్టలేదు. టోల్‌ వసూలు బాధ్యతను వెంటనే చేపట్టకపోవడంతో 2021 అక్టోబర్‌ 14 వరకు దేవస్థానమే సొంతంగా టోల్‌ వసూలు చేసింది. మధ్యలో 2021 ఆగస్టు 14న కారు, జీపు, వ్యాను ధరను రూ. 30 నుంచి రూ. 50, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానం దేవస్థానం వరకూ మాత్రమే వర్తిస్తుంది.

మధ్యలో టోల్‌ రుసుం వసూలు బాధ్యతను 2021 అక్టోబర్‌ 15న మళ్లీ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను పాట సందర్భంగా ఇచ్చిన ధరలకే వసూలు చేయాలని అయితే ఈ ఏడాది కాలంగా పెంచిన ధరలను వసూలు చేస్తున్నారు.  సంబంధిత కాంట్రాక్టరుతో అప్పటి అధికారులు, కొందరు సిబ్బంది కుమ్మకై ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అనుకూలంగా మార్చుకుని, సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

అకస్మాత్తుగా తగ్గిన టోల్‌ ధరలు 
టోల్‌ వ్యవహారం ముదరడంతో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు దానిపై దృష్టి సారించారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పెంచిన ధరలను తగ్గించి, టెండర్‌ షరతుల్లోని టోల్‌ ధరలనే వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన టోల్‌ గేటు వద్ద ఉన్న ధరల పట్టికను మార్పు చేసిన సిబ్బంది, దొరసానిపాడు, శివాలయం రోడ్లలోని టోల్‌గేట్లు వద్ద ఉన్న ధరల పట్టికలను మాత్రం మార్చలేదు. అయితే సుమారు ఏడాది పాటు వసూలు చేసిన అధిక ధరల సంగతేంటి.? వాటిని కాంట్రాక్టరు నుంచి రికవరీ చేస్తారా.? అలాగే కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేలా, శ్రీవారి ఆదాయానికి గండిపడేలా చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతారా.? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

కాంట్రాక్టరుకి నోటీసులిచ్చాం 
దీనిపై ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు వివరణ ఇస్తూ తీర్మానాన్ని అడ్డంపెట్టుకుని కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు భక్తుల నుంచి అధిక ధరలను వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా వసూలు చేసిన అదనపు సొమ్ము రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టరుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు ఈఓ తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగులపై సైతం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కుమ్మక్కయ్యారు  
బహిరంగ వేలం పాట, సీల్‌ టెండర్‌ నిర్వహించిన సమయంలో టోల్‌ వసూల ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ధరకు పాడలేకపోయాం. ఇలా ధరలను పెంచి ఇస్తామని ముందే చెబితే ఎక్కువ ధరకు పాడేవాళ్లం. స్వామివారికి ఆదాయం కూడా మరింత పెరిగేది. కాంట్రాక్టరుతో అధికారులు కుమ్మకై ఇష్టానుసారం ధరలు పెంచి, భక్తుల జేబులకు చిల్లు పెట్టారు. ఇది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను.  
– జంగా వెంకట కృష్ణారెడ్డి, వ్యాపారి ,ద్వారకాతిరుమల,   

మరిన్ని వార్తలు