ఆ మార్కెట్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన టమాటా.. ఏకంగా..!

23 Nov, 2021 02:26 IST|Sakshi

మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన టమాటా

వర్షాల దెబ్బకు తగ్గిన దిగుబడులు.. పెరుగుతున్న ధరలు

మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా అత్యధిక ధర పలికింది. సోమవారం మార్కెట్‌లో మొదటిరకం టమాటా ధర కిలో రూ.104 వరకు పలికింది. వారం రోజులుగా మదనపల్లె డివిజన్‌ పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచి ఉండడం, వర్షం దెబ్బకు పంట నాణ్యత కోల్పోవడం, డ్యామేజీ అధికంగా ఉండడం వంటి కారణాలతో సరుకు లభ్యత కష్టమవుతోంది.

మదనపల్లె, తంబళ్లపల్లె, కర్ణాటకలోని శ్రీనివాసపురం, రాయల్పాడు తదితర ప్రాంతాల నుంచి రైతులు సోమవారం మార్కెట్‌కు 260 మెట్రిక్‌ టన్నుల టమాటాను తీసుకువచ్చారు. వాటిలో మొదటిరకం టమాటా కిలో రూ.60–104 వరకు ధర పలికింది. రెండోరకం టమాటా ధరలు కిలో రూ.18–58 మధ్య నమోదయ్యాయి. వరుసగా వస్తున్న భారీ వర్షాలు, తుపానులతో దేశంలోని అనేక ప్రాంతాల్లో టమాటా పంట బాగా దెబ్బతింది. ప్రజావసరాలకు సరిపడా టమాటా మార్కెట్‌లో దొరకడం లేదు. దీంతో ఉన్నపళంగా సరుకుకు డిమాండ్‌ ఏర్పడి మంచి ధరలు పలుకుతున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెపుతున్నారు. 

మరిన్ని వార్తలు