రేపు అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులు

10 Jan, 2021 20:18 IST|Sakshi

నెల్లూరు వేదికగా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ

సాక్షి, అమరావతి: నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతగా సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతీ అడుగూ ముందుకేస్తున్నారు. అందులో భాగంగానే నవరత్నాల హమీలో అత్యంత కీలకమైన అమ్మఒడికి వరుసగా రెండో ఏడు కూడా శ్రీకారం చుడుతున్నారు. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న గొప్ప ఆలోచనతో వైఎస్‌ జగన్‌ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమాన్ని రెండో ఏడు కూడా  విజయవంతంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని రేపు (సోమవారం) నెల్లూరులో సీఎం ప్రారంభించనున్నారు. (చదవండి: ‘రాజకీయ పార్టీలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తోంది’)

సీఎం పర్యటన ఇలా..
రేపు ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు.11.30 గంటలకు నెల్లూరు శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో అమ్మ ఒడి పథకం రెండో ఏడాది కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.

అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.  పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో సంవత్సరానికి రూ.15 వేలు ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్ధులకు ప్రవేశపెట్టినా... ఇంటర్‌ వరకు కూడా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా గతేడాది దాదాపు 43 లక్షల మంది తల్లుల అకౌంట్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు.(చదవండి: చంద్రబాబు డైరెక్షన్‌లో నిమ్మగడ్డ..

ఈ ఏడాది మరింత మందికి ప్రయోజనం కలిగేలా...
ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ యేడాది నిబంధనలు సడలించిన ప్రభుత్వం... కోవిడ్‌ 19 పరిస్ధితుల్లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధనను మినహాయింపు నిచ్చింది. కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5వేలు, పట్టణాల్లో రూ.6250 ఉంటే, ఈ ఏడు గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు. గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్టభూమి 5 ఎకరాలలోపు  పరిమితి ఉండగా,  ఈ యేడు మగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు. విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాళ్లను అర్హులుగా గుర్తిస్తే..ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు.

గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఫెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు, ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ యేడు అమ్మఒడి వస్తుంది.  గతంలో ఫోర్‌ వీలర్‌ ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్నవారికే మాత్రమే మినహాయింపు నివ్వగా,ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్ధిరాస్ధి ఉన్న వారికి పథంలో అర్హులగా గుర్తించగా, ఈ దఫా 1000 చదరపు అడుగుల స్ధలం ఉన్నవారిని కూడా పథకంలో అర్హులుగా గుర్తిస్తున్నారు.  దీంతో  ఈ దఫా అమ్మఒడి ద్వారా  44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది

కోవిడ్‌-19  నేపథ్యంలో అమ్మఒడి ప్రయోజనాలు...
కోవిడ్‌ విపత్తు పేద, మత్యతరగతి ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపించింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక లక్షలాది మంది కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్ధితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 19, 2020 నుంచి అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమ్మఒడి పేదల పాలిట కవచంలా నిలిచింది. రాష్ట్రంలో సుమారు 43 లక్షల కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.15వేలు జమ చేయడం ద్వారా  ప్రతిఒక్కరిలో అమ్మఒడి వెలుగులు నింపింది. దీనికి తోడు మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక పాఠశాల విద్యా వ్యవస్ధలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. దీర్ఘకాలికగా విద్యా వ్యవస్ధకు గొప్ప మేలు చేసే ఈ కార్యక్రమాలు విద్యార్ధుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాయి. కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా.. తొలుత 9,10 తరగతులకు నవంబరు 23 నుంచి తరగతులు ప్రారంభం కాగా,  7,8 తరగతులకు డిసెంబరు 14 నుంచి తరగతులు మొదలయ్యాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అందరి విద్యార్ధులకు 2020–21 విద్యా సంవత్సరానికి గానూ జగనన్న  విద్యా కానుక కిట్స్‌ అందించటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిర్ధిష్ట విధానంలో పాఠశాలలు నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆరో తరగతి నుంచి విద్యార్ధులకు ఈ యేడాది జనవరి 18 నుంచి తరగతులు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటి పరిస్ధితులను బట్టి ఒకటో తరగతి నుంచి 5 వరకు తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వీటికి అదనంగా ఇప్పటికే విద్యార్ధులకు వివిధ రకాల ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంల సహకారంతో పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.

మనబడి నాడు–నేడు
పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని సమూలంగా మార్పు చేసే చర్యల్లో భాగంగా మనబడి నాడు–నేడుకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇందులో భాగంగా పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మార్పు చేయాలని ప్రభుత్వం  నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3287 ప్రభుత్వ హాస్టళ్లు, 55,607 అంగన్‌వాడీ కేంద్రాల రూపు రేఖలు సమూలంగా మారున్నాయి. ఆధునీకరణలో భాగంగా సుమారు రూ.14 వేల కోట్లు ఖర్చు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వం  చేపట్టింది 2019 నవంబరు 14న బాలల దినోత్సవం రోజున తొలిదశ నాడు–నేడ  కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో  ప్రభుత్వం. కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు నిర్ధేశించింది.
1.రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యంతో పరిశుభ్రమైన మరుగుదొడ్లు 
2.ట్యూబులైట్లు, ఫ్యాన్లతో విద్యుదీకరణ.
3.మంచినీటి సరఫరా
4.ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్ధులకు ఫర్నిచర్‌.
5.పాఠశాలకు పూర్తి స్ధాయి పెయింటింగ్‌.
6.పాఠశాలకు కావాల్సిన అన్ని రకాల మరమ్మతులు
7.గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్‌
8.ఇంగ్లిషు లేబ్‌
9.పాఠశాల చుట్టూ ప్రహారీ
10.కిచెన్‌ షెడ్స్‌
పాఠశాల విద్యా కమిటీలు ఈ పనులన్నింటికీ స్కూల్‌ లెవల్‌లో బాధ్యత పర్యవేక్షించాల్సి ఉంది.

ఇంగ్లిషు మీడియం విద్య
పేద విద్యార్ధులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రాణించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక స్ధాయి నుంచి ఇంగ్లిషుమీడియంలో విద్యా బోధన దిశగా అడుగులు వేసిన ప్రభుత్వం.

జగనన్న గోరుముద్ద
జగనన్న గోరుమద్ద ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45,484 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో దాదాపు 37 లక్షల మంది విద్యార్ధులకు నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతిరోజూ మెనూ మార్చి రుచికరమైన, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. కోవిడ్‌ సమయంలో కూడా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే డ్రై రేషన్‌ పంపిణీ చేశారు.  గత ప్రభుత్వం ఏటా దాదాపు రూ.520 కోట్లు ఖర్చు చేస్తే... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.1,456 కోట్లు ఖర్చు చేసింది. 

జగనన్న విద్యా కానుక
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్ధికి బడులు తెరిచే సమయానికి కుట్టుకూలితో సహా 3 జల యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగ్, టెక్ట్స్‌ బుక్స్, నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్‌ ప్రభుత్వం అందించింది.

పాఠశాలల్లో పారిశుద్ధ్యం
పాఠశాలల్లో పారిశుద్ధ్య వసతులకు, విద్యార్ధుల్లో ముఖ్యంగా బాలికల్లో డ్రాప్‌ అవుట్స్‌ సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న విలోమ సంబంధాన్ని గుర్తించిన ప్రభుత్వం, పాఠశాలల్లో పారిశుద్ధ్య పరిస్ధితుల మెరుగుపరచి డ్రాప్‌ అవుట్లను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి లబ్ధిదారులకు అందించే రూ.15 వేలు నుంచి రూ.1000 జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌లో జమ చేస్తుంది. ఈ సామ్ము ఆ పాఠశాలల్లో టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ కోసం వాడతారు.

వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు..
ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్‌వాడీల్లో ప్రి–ప్రైమరీ 1, ప్రి– ప్రైమరీ 2, ప్రి ఫస్ట్‌ క్లాసు తరగతులు ఉంటాయి. ఇంగ్లిషు  మీడియంలో బోధనతో పాటు ఆటల ద్వారా పాఠాలు, చదువుతో పాటు 8.5 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహార, పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేయనున్నారు. మూడు దశల్లో 2023 జూన్‌ నాటికి అంగన్‌ వాడీ బిల్డింగ్‌ల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. 

జగనన్న విద్యా దీవెన
పేద విద్యార్ధుల కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ, మెడిసన్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కోర్సులు చదివే  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విద్యార్ధులకు రూ.4,101 కోట్ల వ్యయంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోంది.

జగనన్న వసతి దీవెన
ఏటా రూ.2300 కోట్ల ఖర్చుతో ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విద్యార్ధులకు వసతి, భోజన మరియు రవాణా ఖర్చుల కొరకు ప్రతి ఏటా రూ.20 వేలు వరకు రెండు దఫాల్లో చెల్లిస్తోంది. 

విద్యా రంగంపై వైఎస్‌. జగన్‌ గత 12 నెలల్లో చేసిన వ్యయం...
జగనన్న అమ్మ ఒడి పథకం ద్వార 44,48,865 మంది లబ్ధిదారులకు గాను రూ,13,023 కోట్ల రూపాయలు అందించింది. 
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 18,51,043 లబ్దిదారులకు రూ. 4101 కోట్లు వ్యయం.
జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది లబ్ధిదారులకు రూ.1220.99 కోట్లు వ్యయం.
జగనన్న విద్యా కానుక ద్వారా 42,34,322 మంది లబ్ధిదారులకు రూ.647.85 కోట్లు వ్యయం.
జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మంది లబ్ధిదారులకు రూ.1456 కోట్లు వ్యయం.
పాఠశాలల్లో నాడు–నేడు తొలిదశ కింద ఇప్పటివరకు రూ.2248 కోట్లు వ్యయం చేసింది.
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కింద 30,16,000 మంది లబ్ధిదారులకు రూ.1863.13 కోట్లు వ్యయం చేసింది.
మొత్తమ్మీద 1 కోటి 87 లక్షల 95 వేల 804 మంది లబ్ధిదారులకు గానూ గత 12 నెలల కాలంలో వైయస్‌.జగన్‌ ప్రభుత్వం రూ.24,559.97 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదే గత ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో అరకొరగా ప్రతి యేడూ  బకాయిలు పెడుతూ చేసిన వ్యయం కేవలం రూ.3,875.93 కోట్లు మాత్రమే.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు