టన్నుల్లో దొంగ బంగారం 

19 Feb, 2023 04:37 IST|Sakshi

మూడేళ్లలో 8,424.78 కిలోల స్మగ్లింగ్‌ స్వర్ణం స్వాధీనం 

9,408 కేసుల్లో 4,635 మంది అరెస్టు 

పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ  

సాక్షి, అమరావతి: భారత్‌లో పసిడికి ఉన్న డిమాండ్‌ అంతాఇంతా కాదు. ఇదే స్మగ్లర్లకు కొంగుబంగారంగా మారింది. కోవిడ్‌ సమయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలతో 2020లో కొంత మేర బంగారం స్మగ్లింగ్‌ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తరువాత 2021, 2022 సంవత్సరాల్లో స్మగ్లింగ్‌ బంగారం పరిమాణం పెరిగింది. దేశంలో 2020 నుంచి 2022 వరకు అలాగే ఈ ఏడాది జనవరి వరకు స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్‌ బంగారం పరిమాణాన్ని ఇటీవల పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి వెల్లడించారు.

2020 సంవత్సరంతో పోల్చి చూస్తే 2022లో స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్‌ బంగారం పరిమాణం 1,347.58 కేజీలు ఎక్కువగా ఉంది. 2020వ సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి వరకు స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్‌ మొత్తం బంగారం ఏకంగా 8,424.78 కిలోలు. ఈ కాలంలో బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ 9,408 కేసుల్లో 4,635 మందిని అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఉపయోగించే కొత్త కొత్త విధానాలు, పద్ధతులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంకజ్‌ తెలిపారు.  

మాదకద్రవ్యాలదీ అదే రూటు 
దేశంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కూడా పెరుగుతోంది. 2020 ఏడాదిలో 55,622 డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసుల్లో 73,841 మందిని అరెస్టు చేశారు. 2021లో 68,144 కేసుల్లో 93,538 మందిని, 2022 జనవరి నుంచి నవంబర్‌ వరకు 66,758 స్మగ్లింగ్‌ కేసుల్లో 80,374 మందిని అరెస్టు చేశారు. మూడేళ్లలో అత్యధికంగా 19.49 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో హెరాయిన్, కొకైన్‌ వంటివి కూడా ఉన్నాయి.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వివిధ సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నార్కో కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని పంకజ్‌ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు