కందులు.. ఆల్‌టైమ్‌ రికార్డు ధర

7 Mar, 2021 03:17 IST|Sakshi

మార్కెట్‌లో ఎంఎస్‌పీ మించి కొనుగోలు

క్వింటాలుకు రూ.7,200 వరకు ధర

గత నెల వరకు రూ.5,000–5,600 మధ్యే పలికిన ధర.. 

ప్రస్తుతం కందులు కొనుగోలుకు పోటీ పడుతున్న వ్యాపారులు

కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు మార్కెట్‌లలో జోరుగా కొనుగోళ్లు

మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ స్కీమ్‌ కింద గత సీజన్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు ప్రభావం..  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కందులు పంటకు గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌లో కందులు క్వింటాలుకు రూ.7,200 వరకు ధర లభిస్తోంది. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు కావడం విశేషం. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కందులుకు ఇంతటి ధర లభించలేదు. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో గత ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన కందులు పంట చెప్పుకోదగినంతగా దిగుబడులు రాకపోవడంతో దిగాలు పడిన రైతులకు మంచి ధర పలుకుతుండడం సంతోషాన్నిస్తోంది. కందులుకు క్వింటాలుకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) రూ.ఆరు వేలు కాగా గత నెల వరకు మార్కెట్‌లో రూ.5,000 నుంచి రూ.5,600 మధ్య ధర కొనసాగింది. ఇప్పుడీ ధర అమాంతం రూ.ఏడు వేలు దాటింది. రైతుల వద్ద నుంచి కందులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. 

5,44,220 ఎకరాల్లో సాగు..
ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో 5,44,220 ఎకరాల్లో కందుల పంటను రైతులు సాగు చేశారు. సాధారణంగా దీన్ని అంతర పంటగా సాగు చేస్తారు. అంతర పంటగా సాగు చేస్తే ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఒకే పంటగా సాగు చేస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో దిగుబడులు కాస్త తగ్గాయి. కొన్ని జిల్లాల్లో ఎకరానికి 4–5 క్వింటాళ్లు దిగుబడి రాగా, మరికొన్ని జిల్లాల్లో 3–4 క్వింటాళ్లకు మించి రాలేదు. అదే సమయంలో నాణ్యత కూడా తగ్గింది. గత డిసెంబర్‌ నుంచి పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ మార్చి రెండో వారం వరకు ఇవి కొనసాగుతాయి. గత డిసెంబర్‌ 2వ వారం నుంచే మార్కెట్‌కు కందులు వస్తున్నాయి. వచ్చే మే నెల రెండోవారం వరకు కూడా వచ్చే అవకాశముంది.

పోటీ పడి కొంటున్నారు..
కందులు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.6 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌ నెలాఖరు వరకు కందులుకు మార్కెట్‌లో పెద్దగా రేటు లేదు. క్వింటాల్‌ రూ.5,000–5,600 మధ్య ఉండింది. గడిచిన నెల రోజులుగా ఊహించని రీతిలో ధర పెరగడం మొదలైంది. నాణ్యతను బట్టి రూ.6,800 నుంచి రూ.7,200కుపైగా పలుకుతోంది. రాష్ట్రంలో కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు మార్కెట్లకు పెద్ద ఎత్తున కందులు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఇస్తామంటూ వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. 

ప్రభుత్వ చర్యల వల్లే..
నిజానికి మూడేళ్లుగా కందులుకు మార్కెట్‌లో సరైన ధర పలకలేదు. అయితే కనీస మద్దతు ధరలు లభించని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఆ మేరకు గతేడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా కందులును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయించింది. గతేడాది మార్కెట్‌లో కందులుకు రూ.4,500కు మించి ధర పలకలేదు. దాంతో ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,800 చొప్పున కనీస మద్దతు ధరను నిర్ణయించడమేగాక.. 394 కోట్ల రూపాయలు వెచ్చించి 61,772 మెట్రిక్‌ టన్నుల కందులును మార్క్‌ఫెడ్‌ ద్వారా గతేడాది కొనుగోలు చేసింది. అంతేగాక ఈ సీజన్‌లో కందులుకు కనీస మద్దతు ధరను రూ.6 వేలుగా నిర్ణయించి.. అంతకన్నా తక్కువకు విక్రయించవద్దని, ఒకవేళ మార్కెట్‌లో ధర పెరగకుంటే ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొంటుందని రైతులకు అభయమిచ్చింది. ఇది రైతుల్లో భరోసాను నింపగా.. వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటుండడంతో కందులుకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది.

ధర ఇలా పెరగడం ఇదే తొలిసారి..
నా పొలంలో పూర్తి కంది పంట సాగు చేశా. మొన్నటిదాకా క్వింటాలు ధర రూ.5,600కు మించి పలకలేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.6000గా ప్రకటించింది.. కంగారు పడొద్దు.. మార్కెట్‌లో రేటు పెరుగుతుంది.. ఒకవేళ పెరగకపోతే కనీస మద్దతు ధరకు కొంటామని అధికారులు చెప్పారు. ఆ మేరకు ఓపిక పట్టాం. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలుకు రూ.7,200 ధర పలుకుతోంది. దిగుబడి తగ్గినా.. ధర పెరగడంతో ఊరట లభించింది. ఈ ధర ఇలాగే ఉంటే రైతుకు గిట్టుబాటవుతుంది.
–సి.వలీసాహెబ్, చింతకుంటపల్లి, చాపాడు మండలం, వైఎస్సార్‌ జిల్లా

ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే రైతుకు మంచి ధర...
ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మార్కెట్‌లో కందులు, పెసలు ధరలు పెరుగుతున్నాయి. కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులను మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తోంది. ఈ కారణంగానే వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడుతోంది. ఈ కారణంగానే కందులు క్వింటాలు ధర రూ.7,200కు చేరింది. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు. 
–పీఎస్‌ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు