టీఎస్‌ఐసెట్‌లో తొలి 3 ర్యాంకులు ఏపీ విద్యార్థులవే 

28 Aug, 2022 03:51 IST|Sakshi
దంతాల పూజిత వర్ధన్‌ (1వ ర్యాంకర్‌) , ఉమేష్‌చంద్రరెడ్డి (2వ ర్యాంకర్‌ ), కాట్రగడ్డ జితిన్‌సాయి (3వ ర్యాంకర్‌)

కేయూ క్యాంపస్‌(వరంగల్‌):  తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2022–2023 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను జూలై 27, 28 తేదీల్లో నిర్వహించిన టీఎస్‌ఐసెట్‌–2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు, ఫైనల్‌ కీని శనివారం విడుదల చేశారు. తెలంగాణలోని 14 రీజియన్‌ సెంటర్లు, ఏపీలో 4 రీజియన్‌ సెంటర్ల పరిధిలో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌కు 68,781 మంది అభ్యర్థులు హాజరుకాగా, 61,613 మంది(89.58%)ఉత్తీర్ణులయ్యారు. అందులో పురుషులు 33,855 మంది పరీక్షకు హాజరుకాగా 30,409 మంది (89.82%), మహిళలు 34,922మందికి 31,201మంది (89.34%)ఉత్తీర్ణులయ్యారు.

ట్రాన్స్‌జెండర్లు నలుగురు హాజరుకాగా అందులో ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 20 ర్యాంకులు ప్రకటించగా అందులో మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు దక్కాయి. వీరిలో గుంటూరుకు చెందిన దంతాల పూజితవర్ధన్‌ 170.61 మార్కులు సాధించి ఫస్ట్‌ ర్యాంక్‌ పొందగా, వైఎస్సార్‌ కడపకు చెందిన అంబవరం ఉమేష్‌చంద్రరెడ్డి రెండో ర్యాంకు (167.36 మార్కులు), గుంటూరుకే చెందిన కాట్రగడ్డ జితిన్‌సాయి మూడో ర్యాంకు (166.74 మార్కులు) సాధించారు.

నాలుగో ర్యాంకు తెలంగాణాకు చెందిన మహబూబాద్‌ జిల్లా కేసముద్రం వాసి, 8వ ర్యాంకు వరంగల్‌ జిల్లా వాసి దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన త్రివేది సువర్ణ సాత్విక (151.20 మార్కులు) పదో ర్యాంక్‌ పొందారు. ఫలితాలు టీఎస్‌ఐసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.  

మరిన్ని వార్తలు