దేశవ్యాప్తంగా ఉత్తమ సిటీగా విశాఖ

5 Mar, 2021 02:39 IST|Sakshi

దేశంలో ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో 15వ ర్యాంకు 

మున్సిపల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో సాగర నగరికి 9వ ర్యాంకు 

ఈ విభాగంలో ఆథ్యాత్మిక నగరి తిరుపతికి 2వ ర్యాంకు

ర్యాంకులు ప్రకటించిన కేంద్రం 

సాక్షి, విశాఖపట్నం: సుందర నగరి, సిటీ ఆఫ్‌ డెస్టినీగా పేరొందిన మహా విశాఖ మెట్రో నగరాల సరసన నిలిచింది. దేశవ్యాప్తంగా ఉత్తమ నివాస యోగ్య నగరాల జాబితాలో 15వ స్థానం సాధించింది. రాష్ట్రం నుంచి ఈ క్యాటగిరీలో టాప్‌ 20లో నిలిచిన ఏకైక నగరంగా మెరిసింది. ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 111 నగరాలతో పోటీ పడిన విశాఖ 15వ స్థానం సాధించగా విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌–2020’ పేరుతో గురువారం ఈ ర్యాంకులు విడుదల చేసింది.

ఇందులో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో విశాఖపట్నం 15వ స్థానం దక్కించుకుంది. సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితులను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. ఇందులో 15 కేటగిరీల్లో 78 సూచీలను విభజించి సర్వే నిర్వహించారు. ఇనిస్టిట్యూషనల్, భౌతిక పరిస్థితుల పరంగానూ విశాఖ నగరం మంచి ర్యాంకు సాధించింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో మొత్తం 100 పాయింట్లకు గాను 57.28 పాయింట్లు సాధించింది. 2018లో విడుదల చేసిన ర్యాంకుల్లో విశాఖ 17వ స్థానంలో నిలవగా ఈసారి రెండు ర్యాంకుల్ని మెరుగుపరచుకుంది. 

మున్సిపల్‌ పెర్‌ఫార్మెన్స్‌లో 9వ ర్యాంకు...
ఇక 10 లక్షలకుపైగా జనాభా కేటగిరీలో మున్సిపల్‌ పెర్‌ఫార్మెన్స్‌ విభాగంలో 52.77 పాయింట్లుతో విశాఖ నగరం 9వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుల్ని 2020 ఆగస్టులో ప్రకటించాల్సి ఉండగా కోవిడ్‌ కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. 2020 నుంచి విశాఖ నగరం వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2018–19లో 23వ స్థానంలో నిలిచిన విశాఖ నగరం 2019–20లో 14 ర్యాంకుల్ని మెరుగు పరచుకొని 9వ ర్యాంకులోకి దూసుకెళ్లింది. 2019లో స్మార్ట్‌ సిటీ నగరాల జాబితాలో 9వ ర్యాంకులో ఉండగా.. 2020లో టాప్‌–7లో నిలిచింది. తాజాగా నివాస యోగ్య నగరాల జాబితాలోనూ  విశాఖ నగరం ర్యాంకుని మెరుగు పరచుకుంది. 

వివిధ విభాగాల్లో విశాఖ దూసుకెళ్లిన విధానాన్ని ఓసారి పరిశీలిస్తే...
ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌...
– ఓవరాల్‌ ర్యాంకు – 15
– సస్టైన్‌బులిటీ విభాగంలో 65.18 మార్కులతో 2వ స్థానం
– ఎకనమిక్‌ ఎబిలిటీలో 19.42 మార్కులతో 18వ స్థానం
– ప్రజావగాహన(సిటిజన్‌ పర్సిప్షన్‌)లో 77.20 మార్కులతో 23వ స్థానం
– జీవన ప్రమాణాల విభాగంలో 51.93 మార్కులతో 25వ స్థానం

మున్సిపల్‌ పెర్ఫార్మెన్స్‌....
ఓవరాల్‌ ర్యాంకు– 09
– ప్లానింగ్‌ విభాగంలో 71.81 మార్కులతో 1వ స్థానం
– సేవలందించే విభాగంలో 63.35 మార్కులతో 8వ స్థానం
– ఆర్థిక స్థితిగతుల విభాగంలో 59.87 మార్కులతో 11వ స్థానం
– టెక్నాలజీ వినియోగంలో 34.64 మార్కులతో 12వ స్థానం
– గ్రీవెన్స్‌ విభాగంలో 29.13 మార్కులతో 49వ స్థానం

తిరుపతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
మున్సిపల్‌ పర్ఫామెన్స్‌లో 2వ ర్యాంకు
తిరుపతి తుడా: ఆథ్యాత్మిక నగరం తిరుపతికి మరో గౌరవం దక్కింది. మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయ స్థాయిలో తిరుపతి రెండో ర్యాంకు సాధించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో న్యూఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇదే కేటగిరీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆథ్యాత్మిక నగరానికి దక్కిన ఈ గుర్తింపు పట్ల తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీష సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు