నల్లమలలో ఆర్కే కీ రోల్‌..!

15 Oct, 2021 15:58 IST|Sakshi
టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష నివాసం వద్ద విషన్నవదనంలో బంధువులు, ఇన్‌సెట్‌లో ఆర్కే ఫైల్‌ ఫొటో 

నల్లమల దళాలకు దిశానిర్దేశం

టంగుటూరు మండలం ఆలకూరపాడు అల్లుడు

మృతివార్తతో గ్రామంలో విషాదఛాయలు

ఒంగోలు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ ఉరఫ్‌ ఆర్‌కే మృతి వార్తల ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు ఆర్‌కే సతీమణి నివాసం ఉండే టంగుటూరు మండలం ఆలకూరపాడులో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. దట్టమైన నల్లమల అడవులు మావోయిస్టులకు కేంద్రంగా నిలిచాయి. నల్లమలలో దాదాపు 47 దళాలు పనిచేసేవి. రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ రామకృష్ణ ఈ దళాలకు మార్గదర్శకంగా వ్యవహరించేవారు. (చదవండి: భర్త చేసిన పనిని సోషల్‌ మీడియాలో పెట్టిన భార్య!

ఈ క్రమంలోనే మావోయిస్టులపై (అప్పట్లో నక్సలైట్లు) పోలీసులు ఉక్కుపాదం మోపడంతో రామకృష్ణ అండర్‌గ్రౌండుకు చేరుకున్నారు. ఇలా ఆయన అండర్‌గ్రౌండులో ఉన్న సమయంలోనే టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన కందుల శిరీష అలియాస్‌ పద్మను 1988లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మున్నా అలియాస్‌ పృథ్వీ అలియాస్‌ శివాజీ జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలల తరువాత రామకృష్ణ తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు.

ప్రభుత్వ చర్చలకు జిల్లా నుంచే బయటకు: 
జిల్లాలోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. 2004 అక్టోబరు 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మావోయిస్టులతో చర్చలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో వారు దోర్నాల మండలం చినారుట్ల వద్ద నుంచి బయటకు వచ్చారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా గుత్తికొండ బిళం వద్ద మావోయిస్టులంతా కలుసుకుని చర్చలు జరిపి అనంతరం కారుల్లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం జిల్లా నుంచి తిరిగి దళాలు చినారుట్ల వద్ద నుంచే అడవుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో 2005లో ఒంగోలులో అప్పటి ఎస్పీ మహేష్‌చంద్ర లడ్హాపై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర పోలీసుశాఖ సీరియస్‌గా తీసుకుంది. కొద్ది నెలలకే యర్రగొండపాలెం మండలం పాలుట్ల అటవీ ప్రాంతంలో అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తోపాటు పలువురు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. ఈ ఘటనలో అగ్రనేత ఆర్‌కే తప్పించుకున్నాడు.

చదవండి: Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..? 

తండ్రి బాటలోనే తనయుడు: 
ఇంటర్‌ వరకు విద్యనభ్యసించిన మున్నా అలియాస్‌ పృథ్వీ అలియాస్‌ శివాజీ కూడా తండ్రి అడుగు జాడల్లోనే ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 2009లో తండ్రి చెంతకు చేరిన మున్నా అతి కొద్దికాలంలోనే టెక్నికల్‌ డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. తరువాత కొన్నాళ్లకు రామకృష్ణను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె రామకృష్ణ భార్యగా వెల్లడైంది. ఆమె పేరు శిరీష అని, పద్మగా పిలుస్తుంటారనేది తెలిసింది. అంతే కాకుండా విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకుడు కళ్యాణరావుకు శిరీష మరదలు కూడా కావడంతో మరింత నిఘా పెంచారు.

ఏఓబీ ఇన్‌చార్జిగా: 
అయితే నల్లమలలో పోలీసుల పట్టు పెరగడం, అనేక మంది మావోయిస్టులు దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో ఎన్‌కౌంటర్‌లకు గురికావడంతో మావోయిస్టులు నల్లమలను వదిలి దండకారణ్య ప్రాంతమైన ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌పై పట్టు పెంచారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలతో కలిసి కార్యకలాపాలు ఉధృతం అయ్యాయి.

2008లో బలిమెల ఘటనలో కృష్ణానదిలో ప్రయాణిస్తున్న భద్రతా దళాలపై జరిగిన దాడిలో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం నాలుగు రాష్ట్రాలతో ప్రత్యేకమైన యాక్షన్‌ టీమును రంగంలోకి దించిన సందర్భంలో 2016లో పృథ్వీ మరణించగా ఆర్కే తప్పించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, తద్వారా ఆయన కన్నుమూసినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బంధువులు మాత్రం ఆయన మరణవార్తను నిర్థారించడం లేదు. మావోయిస్టు పార్టీ నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు