అక్టోబర్‌ నుంచి వందశాతం ఆర్టీసీ సర్వీసులు

28 Sep, 2020 07:58 IST|Sakshi

వందశాతం సీట్లతో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు 

తొలగించిన సీట్లను తిరిగి అమర్చే పనిలో కార్మికులు

సాక్షి, తిరుపతి అర్బన్‌ : జిల్లాలోని అన్ని బస్సు సర్వీసులు అక్టోబర్‌ నుంచి రోడ్డెక్కనున్నాయి. కరోనా మహమ్మారి ఆరునెలలుగా అన్ని శాఖలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అందులో ఆర్టీసీ ప్రధానమైంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం మార్చి 21 నుంచి మే 20 వరకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. మే 21నుంచి ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినప్పటికీ 30శాతం బస్సులకు మించి నడపలేని పరిస్థితి. మరోవైపు భౌతికదూరంలో భాగంగా 50 శాతం సీట్లను తొలగించి ఆర్టీసీ ప్రయాణికులకు సేవలు అందించింది.  (ప్రైవేట్‌ బస్సుల్లో అధిక చార్జీలకు బ్రేకులు)

ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ చార్జీలు పెంచకపోవడం అభినందనీయం. అక్టోబర్‌ నుంచి అన్ని ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు 100శాతం సీట్లతో బస్సులను తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. దాంతో ఆర్టీసీ బస్సుల్లో తొలగించిన సీట్లను సరిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1550 సర్వీసులున్నాయి. అయితే 500కు మించి బస్సులను కరోనా సమయంలో నడపలేకపోయారు.

అ్రల్టాడీలక్స్, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో మాత్రమే సీట్లను తొలగించారు. పల్లెవెలుగు సర్వీసుల్లో ఇన్‌టూ మార్క్‌తోనే 50శాతం సీట్లతో బస్సులను తిప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా డిపోలకు చెందిన గ్యారేజ్‌ మెకానిక్స్‌ తొలగించిన సీట్లను జోరుగా భర్తీ చేస్తున్నారు. మొత్తం మీద ఆర్టీసీకి మళ్లీ పూర్వవైభవం రానుంది.  

మరిన్ని వార్తలు