మన్యం ఎప్పుడూ తలుపులు తెరిచే..

22 Nov, 2020 15:16 IST|Sakshi

ఆరేడు నెలలు ఇంట్లోనే గడిచిపోయాయి. కాళ్లు కాస్త కదలిక కోరుకుంటున్న సమయమిది. కార్తీకం కూడా కలిసి వచ్చింది. కరోనాపై కొంచెమైనా అవగాహన కలిగింది. ఇంకెందుకు ఆలస్యం.. కుటుంబంతో సహా విహరించాల్సిందే కదా. ప్రకృతి అందాలకు సిక్కోలు పెట్టింది పేరు. సాహస యాత్ర చేయాలనుకునే వారికి మన మన్యం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. అడవుల్లోకి వెళ్లి అంతెత్తున దూకే జలపాతం వద్ద శిరస్సు వాల్చి సేద తీరవచ్చు. రహస్యాలను తెలుసు కోవాలనుకుంటే శాలిహుండం శతాబ్దాలుగా సవాల్‌ విసురుతూనే ఉంది.

వచ్చి అశోకుడి కాలం నుంచి ఇప్పటివరకు కొండ గుండెలో దాగిన విషయాలను తెలు సుకోవచ్చు. ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలనుకుంటే.. శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస ఆలయాలు మన కోసమే సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కా దు.. బీచ్‌లో సేద తీరాలి అనుకుంటే బారువ నుంచి భావనపాడు మీదుగా మొగదలపాడు వరకు ఊరూరా సముద్ర తీరాలు ఊరిస్తున్నాయి. రండి మరి.. 576 మెగా పిక్సెళ్ల కళ్ల కెమెరాలతో క్లిక్‌ చేసి ఇన్ఫినిటీ జీబీ గల మనసు మెమొరీలో నిక్షిప్తం చేద్దాం.  

కొండనెక్కగలవా.. 
ఆమదాలవలస రూరల్‌: ఆమదాలవలస పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర కొండ పిక్నిక్‌లకు కేరాఫ్‌గా మారింది. ఏటా వందలాది మంది ఇక్కడకు వస్తున్నారు. సంగమేశ్వర కొండ ప్రాచీనకాలం నాటిది. ఈ కొండ చరిత్ర 12వ శతాబ్దానికి చెందినదని 1982లో సర్వే చేసిన పురావస్తు అధికారులు తేల్చి చెప్పారు. జైన, బౌద్ధ, శైవ ధర్మాలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ చూడవచ్చు. స్వామిని దర్శించుకోవాలంటే 164 మెట్లు ఎక్కాలి. కొండ ఫైబాగం నుంచి ఈ కష్టాన్ని మర్చిపోయేంత సౌందర్యం కనిపిస్తుంది. సంగమేశ్వరకొండకు దగ్గరలోనే చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. కొండకు సమీపంలో ఆసియా ఖండంలోనే పేరుపొందిన వ యోడెక్ట్, పాండవుల మెట్ట ఉన్నాయి.

సంగమేశ్వర కొండపై నుంచి కనిపిస్తున్న ఆహ్లాదకరమైన ప్రకృతి 

విహంగ వీక్షణం 
టెక్కలి: అంతర్జాతీయ స్థాయిలో ఎంతో విశిష్టత కలిగిన పెలికాన్, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షి జాతికి చెందిన విదేశీ పక్షుల విడిది కేంద్రం టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో ఉంది. వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చే పక్షులను చూడడానికి సందర్శకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా కార్తీకంలో వన విహారం చేయాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ఇదో మంచి విడిది. ఈ పక్షుల విడిది కేంద్రంలో వాచ్‌టవర్‌ పక్షుల  విన్యాసాలను తిలకించేందుకు ఎంతో అనుకూలం. శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుని అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రానికి చేరుకునేందుకు బస్సులు, ఆటోల సదుపాయం ఉంది. దీనికి సమీపంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఏటా కార్తీకంలో వేలాది మంది స్వామిని దర్శించుకుంటారు. వీటికి సమీపంలోనే భావనపాడు సముద్ర తీరం కూడా ఉంది. ఈ మూడు ప్రాంతాలను కవర్‌ చేస్తే కార్తీక వన విహారం సంపూర్ణమవుతుంది.

టెక్కలి మండలం తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రంలో గల చెట్లు పై విదేశీ పక్షులు

సాగర తీరాన.. 
సోంపేట: ఉండడానికి మంచి రిసార్ట్‌లు, దర్శించుకోవడానికి పురాతన ఆలయాలు, తిరగడానికి తోటలు, సేద తీరడానికి సముద్ర తీరం.. పిక్నిక్‌కు ఇంత కంటే మంచి ప్లేస్‌ ఏముంటుంది..? ఇవన్నీ గుంపగుత్తగా అందించే ప్రదేశం బారువ. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఈ పురాతన గ్రామం ఎప్ప టి నుంచో జిల్లా వాసులకు హాట్‌ ఫేవరిట్‌ స్పాట్‌. ఇక్కడి సముద్ర తీరంలో కనిపించే ఓడ శిథిలాలు, కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి దేవాలయం అన్నీ ప్రత్యేక అనుభూతినిస్తాయి. ఇక్కడి లైట్‌హౌస్‌ ఆనాటి వైభవానికి గుర్తుగా కనిపిస్తుంది. దానిపైకి ఎక్కి సముద్రాన్ని చూసి తీరాల్సిందే. శ్రీకాకుళం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో బా రువ ఉంది. శ్రీకాకుళం నుంచి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి. రైల్వే మార్గం గుండా రావాలంటే సోంపేట(కంచిలి) రైల్వేస్టేషన్‌లో దిగి, కంచిలి నుంచి బస్సులు, ఆటోల ద్వారా రావచ్చు. ప్రస్తుతం ఈ బీచ్‌లోని రిసార్ట్‌లో ఆరు గదులు అందుబాటులో ఉన్నాయి. జనవరికి మొత్తం 14 గదులు సిద్ధమవుతాయి. గదులు కావలసిన వారు 72784 58888, 72784 68888 నంబర్లను సంప్రదించవచ్చని రిసార్ట్‌ ప్రతినిధులు తెలిపారు. 

సాహసం చేయాలి మరి.. 
భామిని: కొండలను తాకే మేఘాలు, జలజల పారే జలపాతాలు, పచ్చని తివాచీ పరిచినట్టుంటే కొండ చరియలు, వంపులు తిరిగే ఘాట్‌ రోడ్లు.. ఇలా సకల అందాల నిలయం తివ్వాకొండల పరిసరస ప్రాంతాలు. పెద్దగా జనం దృష్టి పడని అందాలు ఇవి. పిక్నిక్‌కు సాహస యాత్రకు వెళ్లాలనుకుంటే భామిని మండలంలోని అడవులపై ఓ లుక్కేయవచ్చు. భామిని మండలం భూర్జిగూడ సమీపంలో జలపాతాలు, మణి గ రోడ్డులో వాటర్‌ ఫాల్స్, నూతనంగా ఆవిష్కృతమైన నులకజోడు సమీపంలో జలపాతాలు అలరిస్తున్నాయి. ఇవన్నీ ఏబీ రోడ్డుకు మూడు కిలోమీటర్లు దూరంలోనే ఉన్నాయి. తివ్వాకొండలను ఆనుకొని ఉన్న చాపరాయిగూడ వద్ద పులిహొండా గృహానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. దీన్ని ప్రస్తుతం యంగ్‌మేరీ కేవ్‌గా తీర్చిదిద్దారు. సందర్శకులను ఆకట్టుకుంటోంది. భామిని మండలంలో ఏబీ రోడ్డు నుంచి మణిగ, బండ్రసింగి, రేగిడి, కారిగూడల ఘాట్‌ రోడ్లు ప్రయాణాన్ని మధురం చేస్తాయి.

సొలికిరి వద్ద చాపరాయి పులిహొండ(ఫైల్‌) 

ఎన్నెన్నో అందాలు 
వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు ప్రకృతి అందాలతో అలరారుతోంది. ప్రాజెక్టులో నిండుగా ఉన్న నీరు, నీటిని ఆనుకొని చుట్టూ కొండలు చూపరులను కార్తీకంలో ఆహా్వనిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద బకెట్‌ పోర్షన్, నీటిమట్టాన్ని సూచించే ప్రదేశం, ప్రాజెక్టు ఆవరణలో ఉన్న డైక్, కొండపై నిర్మించిన సాయినాథుని ఆలయం, పాండవు ల పంచ సందర్శకులకు అద్భు త అనుభూతిని ఇస్తాయి. అయితే ప్రాజెక్టు వద్ద నీటిలో దిగే సాహసాలు చేయకుండా ఎంజాయ్‌ చేయగలిగితే కుటుంబంతో పిక్నిక్‌కు రావడానికి మడ్డువలస ప్రా జెక్టు సరైన స్థలం. ప్రాజెక్టుతో పాటు ఇక్కడి నుంచి సంగాం గ్రామం 6 కిలోమీటర్లు దూ రం. ఇక్కడ నెలకొన్న సంగమేశ్వరస్వామి ఆలయంలో ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించిన శివలింగం ప్రతిష్టాత్మకమైనది. ఇదే ప్రాంగణంలో వేగావతి, సువర్ణముఖి, నాగావళి నదులు కలిసే కూడలి (త్రివేణి సంగమం) అందరికీ నచ్చుతుంది. ఎం.సీతారాంపురంలో 108 స్తంభాల శివాలయం చూడదగ్గ ఆలయం.

మడ్డువలస జలాశయం

అడవి ఒడిలో.. 
సీతంపేట: కార్తీక మాసం ఆరంభం కావడంతో మన్యం పర్యాటకులతో కళకళలాడనుంది. సీతంపేటలోని అ డ్వంచర్‌ పార్కు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెట్టుగూడ జల పాతం రెండేళ్లుగా ప్రాచుర్యం పొందింది. సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారి మధ్య సీ తంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలో మీటర్ల దూరంలో ఉన్న సున్నపుగెడ్డ, పొల్ల–దోనుబాయి మా ర్గంలో ఉంది. ఈ అందమైన జలపాతం కొండలోయ దిగువ నుంచి చూస్తే ఇంద్ర ధనస్సు సైతం కనిపిస్తుందని సందర్శకులు అంటుంటారు. చంద్రమ్మ గుడి, ఆ డలి, పొల్ల, జగతపల్లి వ్యూపాయింట్‌లు సాహస యాత్ర చేయాలనుకునే వారిని ఆకట్టుకోగల ప్రాంతాలు.

మెట్టుగూడ వద్ద స్నానాలు 
ప్రకృతి అందాల సింగారం 
గార: గార మండలం వన విహారం చేయాలనుకునే వారికి పర్‌ఫెక్టు ప్లేసు. సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, సువిశాలమైన తోటలతో ఈ మండలం కార్తీకానికి సై అంటోంది. మండలంలో దశావతారాల్లో ఒకటైన శ్రీకూర్మనాథాలయం, కళింగ తీరంలో లైట్‌హౌస్, బౌద్ధ ఆరామాల్లో ఒకటైన శాలిహుండం, పక్కనే మరో కొండపై వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. వీటిలో ప్ర ముఖమైనది శాలిహుండం. ప్రశాంతమైన కొండపై శతాబ్దాల నాటి రహస్యాలను తరచి తరచి చూస్తే ఆ మ జానే వేరు. ఇక శ్రీకూర్మనాథుని దర్శనం, ఆలయ ప్రాశస్త్యం తెలుసుకోవడం ఎవరికైనా మర్చిపోలేని అనుభూతి. అటుపై నుంచి తీరానికి రూటు మారిస్తే పిక్నిక్‌ పరిపూర్ణమవుతుంది. ఈ స్థలాలకు శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ సరీ్వసులతో పాటు, ప్రైవేటు రవాణా సదుపాయాలూ విరివిగా ఉన్నాయి.

శాలిహుండం బౌద్ధారామం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా