ఇదేనా బాబూ.. మీ క్రమశిక్షణ?

31 Oct, 2021 03:41 IST|Sakshi

‘సాక్షి’ లేకుంటే నాపై తీవ్రవాది ముద్రవేసే వారు

టూరిజం ఉద్యోగి మోహన్‌ ఆవేదన

సాక్షి ప్రతినిధి, తిరుపతి/కుప్పం: టీడీపీ శ్రేణుల క్రమశిక్షణ ఏపాటిదో తనలాంటి వాళ్లకు ఇప్పుడు బాగా తెలిసొచ్చిందని పర్యాటక శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ మోహన్‌ అన్నారు. తనను చంద్రబాబు ఎదుటే చచ్చేటట్టు కొడుతుంటే ఆయన కనీసంగా స్పందించి అడ్డుకోవాల్సింది పోయి.. వారిని ప్రోత్సహించడం చాలా బాధేసిందని చెప్పారు. శుక్రవారం కుప్పంలో చంద్రబాబును కలవడానికి వచ్చిన ఇతన్ని బాంబులేయడానికి వచ్చాడని టీడీపీ శ్రేణులు చితక్కొట్టిన విషయం తెలిసిందే.

పోలీసుల జోక్యంతో కుప్పం ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వచ్చారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘నన్ను కళ్ల ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు కొడుతున్నా బాబు నిలువరించే యత్నం చేయలేదు. నేను ఎంత చెబుతున్నా వినకుండా దారుణంగా కొట్టారు. మెడలో నా బంగారు గొలుసును బలవంతంగా లాగేసుకున్నారు. మెడపై గాయమైంది. చిన్నప్పటి నుంచి సెంటిమెంట్‌గా చెవికి పెట్టుకున్న దిద్దులను కోసేశారు. దాంతో చెవులు తెగి రక్తస్రావమైంది. అప్పుడు పోలీసులు రాకుంటే నన్ను చంపేసేవారు. ‘సాక్షి’ లేకుంటే నన్ను ఓ ఉగ్రవాదిగా ప్రొజెక్ట్‌ చేసేవాళ్లు’ అని చెప్పుకొచ్చారు. 

హత్యాయత్నం కేసు
తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందంటూ మోహన్‌ కుమారుడు ప్రవీణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుప్పం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపేందుకు యత్నించారంటూ పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శనివారం పర్యాటక శాఖ తిరుపతి డివిజనల్‌ మేనేజర్‌ టి.గిరిధర్‌రెడ్డి విచారణ జరిపి బాధితుడు నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు