పర్యాటక గడప కడప.. మణిమకుటంలా గండికోట

27 Sep, 2022 09:28 IST|Sakshi

పుష్పగిరి, గండి, పొలతలలో పెరిగిన పర్యాటకుల సందడి

నేడు పర్యాటక దినోత్సవం

వైఎస్సార్‌ జిల్లాలో పర్యాటకాభివృద్ధి వేగం పుంజుకుంది. కనీసం నాలుగైదు ప్రాంతాల్లో కొత్తగా పర్యాటకుల సందడి పెరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కావడం, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో గొప్ప ప్రాంతాలు ఉండడంతో కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఏటా పర్యాటకరంగంపై సమీక్షించుకునేందుకు సెప్టెంబరు 27న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగం తీరుతెన్నులపై కథనం. 

జిల్లా పర్యాటక రంగానికి గండికోట మణిమకుటంలా వెలుగుతోంది. ఇక్కడి ప్రైవేటు పర్యాటక టెంట్ల ద్వారా ప్రతి శని, ఆదివారాలలో రూ. 10 లక్షలకు పైగా రాబడి ఉంది. అధికారులు ఇటీవల టెంట్లను ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసే పద్ధతిని ప్రవేశపెట్టి క్రమబద్ధీకరించారు. ఇక్కడి రాబడిని గమనిస్తే గండికోట పర్యాటక వైభవం ఎలా ఉందో అంచనా వేయవచ్చు. శని, ఆదివారాల్లో కోటలోని హరిత హోటల్‌లో గదుల కోసం ఒకటిన్నర నెల ముందే రిజర్వు చేసుకోవాల్సి వస్తుండడం కూడా గమనార్హం. ఈ కోటకు యునెస్కో వారసత్వ హోదా కల్పించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

సీఎం ప్రత్యేక శ్రద్ధ 
జిల్లాలో పర్యాటకాభివృద్ధికి గల అనుకూలతలను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ, సోమశిల వెనుక జలాలను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేసే విషయంపై దృష్టి పెట్టారు. ఇడుపులపాయ, పార్నపల్లె, పైడిపాలెం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లను కూడా పర్యాటకంగా తీర్చిదిద్ది బోటింగ్‌ సౌ కర్యం కల్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సోమశి ల వెనుక జలాల ప్రాంతాల్లో అటవీశాఖ వన విహారి పేరిట జలాధార పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోంది. ఇవే కాకుండా ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, పుష్పగిరి, వేంపల్లె గండి, పొలతల తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. 

మన కడప బస్సు యాత్ర 
కలెక్టర్‌ మన కడప పేరిట కడప సమీపంలోని నాలుగు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ఏసీ బస్సు యాత్రకు అవకాశం కల్పించారు. నాలుగు వారాలుగా ఈ యాత్ర విజయవంతంగా సాగుతోంది.  

జిల్లాలో పర్యాటకాభివృద్ధి కోసం రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ లాంటి సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే పలు పర్యాటక పుస్తకాలు, బ్రోచర్లు, ఫొటో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఈ రంగానికి ప్రచారం కల్పిస్తున్నాయి. ఇప్పటికి రాష్ట్ర పర్యాటకశాఖ జిల్లాలో ఇద్దరు రచయితల పర్యాటక పుస్తకాలకు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ప్రకటించడం జిల్లాలో జరుగుతున్న పర్యాటక కృషికి నిదర్శనం.

2022 సంవత్సరానికిగాను రాయలసీమ టూరిజం సంస్థ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజుకు జిల్లాలో టూరిజానికి ఉత్తమ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నందుకు ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రకటించగా మంగళవారం తిరుపతిలో అవార్డు ప్రదానం చేయనున్నారు. ఐదేళ్లుగా వరుసగా రాష్ట్ర పర్యాటకశాఖ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను జిల్లా వాసులు కైవసం చేసుకోవడం గమనిస్తే జిల్లాలో వ్యక్తులు, సంస్థలు పర్యాటకాభివృద్ధికి ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో అర్థమవుతోంది.  ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్న ఆశలు కలుగుతున్నాయి. 

సీఎం సూచనతో... 
డిగ్రీలో పర్యాటకం కోర్సును ప్రతి కళాశాలలో తప్పక నిర్వహించాలని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడం ఆ రంగంపై ఆయనకు గల అభిమానాన్ని, అంకిత భావాన్ని చాటుతోంది. ఇప్పటికే కడపలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మూడు సంవత్సరాలుగా దాదాపు 50 మందికి పైగా విద్యార్థినులు బీఏలో టూరిజం కోర్సు చేశారు.  ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో కూడా త్వరలో టూరిజం కోర్సు ప్రారంభం కానుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ ఈ కోర్సును ప్రారంభించేందుకు సుముఖంగా ఉండడం శుభపరిణామం.  

మరిన్ని వార్తలు