ఇక తనివి తీరా... పాపికొండల అందాల వీక్షణ

12 Apr, 2021 03:37 IST|Sakshi
పాపికొండల్లో విహరించనున్న హరిత ఏసీ లగ్జరీ బోటు

ఈ నెల 15వ తేదీ నుంచి ఏసీ లగ్జరీ బోటు ప్రారంభం

18 నెలల విరామం అనంతరం.. పర్యాటక ప్రేమికుల్లో ఆనందం  

రాజమహేంద్రవరం సిటీ: దాదాపు పద్దెనిమిది నెలల విరామం అనంతరం గోదావరి నది పాపికొండల అందాలను వీక్షించే అవకాశం లభించనుండడంతో పర్యాటక ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2019 సెప్టెంబర్‌ 15న తూర్పు గోదావరిజిల్లా  కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడంతో.. గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్‌ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

ఈ నెల 15వ తేదీ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ లగ్జరీ బోటు నడపనున్నారు. కాగా, రాజమహేంద్ర వరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తగిన ప్రమాణాలు పాటించిన ఏసీ లగ్జరీ బోట్లను మాత్రమే.. అదికూడా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందిన అనంతరమే విహారానికి అనుమతించాలని సూచించింది. అయితే  పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు లగ్జరీ బోట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

తాజాగా ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హరిత ఏసీ లగ్జరీ బోటుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. దీంతో 18 నెలల విరామం అనంతరం పటిష్టమైన ప్రణాళిక, రక్షణ చర్యల మధ్య పాపికొండల విహారానికి పర్యాటక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి పాపికొండల విహారానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని సింగన్నపల్లి రేవు నుంచి లగ్జరీ బోటు నడిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని టూరిజం శాఖ అధికారి టి.వీరనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.750 చార్జీగా నిర్ణయించాలని యోచిస్తున్నామన్నారు. కేవలం ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మాత్రమే ఒక బోటు నడుస్తుందని, ప్రైవేట్‌ ఆపరేటర్ల బోట్లకు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఏపీటీడీసీ’ వెబ్‌సైట్‌లోకెళ్లి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు